రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు
ప్రధాని మోడీ స్వయంగా పేరు మార్పు నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశంలో క్రీడాకారులకు అందించే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరు ఇక నుంచి విన్పించదు. ఈ అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మార్చారు. దేశ ప్రజలందరి నుంచి వచ్చిన విజ్ఞప్తులతో వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ పేరు మీదుగా ఖేల్‌రత్న పురస్కారం 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడాకారులకు అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రాజీవ్ పేరు తొలగించి ధ్యాన్‌చంద్ పేరు పెట్టారు. ధ్యాన్‌చంద్ భారత హకీ దిగ్గజం.
ధ్యాన్‌చంద్ కెప్టెన్సీలో హకీ జట్టు మూడుసార్లు వరుసగా ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. అంతటి గొప్ప వ్యక్తి జయంతిని (ఆగస్టు 29) జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో మళ్లీ భారత హాకీ జట్టు పతకం పొందింది. మహిళల జట్టు సెమీ ఫైనల్ వరకు వెళ్లి అద్భుత ప్రదర్శన చేసినా నిరాశ చెందారు. అయినా వారి పోరాటాన్ని దేశం కీర్తించింది. వీటన్నింటినీ చూస్తుంటే హాకీకి పూర్వ వైభవం వచ్చిందని అందరూ భావిస్తున్నారు. అయితే ప్రధాని మోడీ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపడుతోంది. క్రీడల కోసం ఎంతో చేసిన రాజీవ్ పేరును తొలగించటం దురుద్దేశపూరితం అంటూ విమర్శలు గుప్పిస్తోంది.