ప్రధాని మోడీకి 12 కోట్ల రక్షణ కవచ కారు
భారత ప్రధాని నరేంద్రమోడీ కాన్వాయ్ లో అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడా కొత్త కారు చేరింది. ఈ కారు ధర 12 కోట్ల రూపాయలు. మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 650 సాయుధ వాహనాన్ని పీఎం కాన్వాయ్ లో చేర్చారు. ఎస్ 640 గార్డుతో లోపల ఉన్న వారికి పూర్తి రక్షణ లభిస్తుంది. అంతే కాదు కేవలం రెండు మీటర్ల దూరంలో 15 కెజీల టీఎన్ టీ పేలుళ్ళు జరిగినా కూడా ఈ కారు రక్షణ కల్పిస్తుంది. తాజాగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్ తో హైదరాబాద్ హౌస్ లో మోడీ సమావేశం అయిన సమయంలోనే ఈ కారు కన్పించిందని హిందూస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. దేశంలో ప్రధానితోపాటు వీవీఐపీల భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్ పీజీ) పర్యవేక్షణ చేస్తుందనే విషయం తెలిసిందే. ఈ వాహనాలు అన్నీ కూడా వారి ఆధీనంలోనే ఉంటాయి. వీరి సూచనల మేరకే ఈ కొత్త కారును ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్లు పేర్కొన్నారు. మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 650 కారు గంటకు గరిష్టంగా 160 కిలోమీర్ల వేగంతో వెళ్ళగలదు.
వీఐపీల వాహనాలపై ఏదైనా గ్యాస్ దాడి జరిగితే దాని నుంచి కాపాడేలా ఈ కారులో గాలి సరఫరా ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. దాడి జరిగిన సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా ఇంథన ట్యాంక్ ఆటోమేటిక్ గా స్పందించేలా ఏర్పాట్లు చేశారు. అపాచీ హెలికాప్టర్లలో ఇంథన ట్యాంకులకు ఎలాంటి మెటీరియల్ వాడతారో ఈ కారుకు కూడా అలాంటి మెటీరియల్ వాడినట్లు ఈ కధనం పేర్కొంది. అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్ తో ఈ కారును సిద్ధం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ బుల్లెట్ ప్రూఫ్ మహీంద్రా స్కార్పియో వాడేవారని, 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన హెసెక్యూరిటీతో కూడిన బీఎండబ్ల్యూ 7 సీరిస్ వాహనం వాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 650 వచ్చి చేరింది. మోడీ ప్రధాని అయిన తర్వాతనే 8400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రధాని ఉపయోగించే ఇండియా వన్ విమానాలను అత్యాధునికంగా తీర్చిదిద్దన విషయం తెలిసిందే.