కేంద్రం నుంచి భరోసా ప్రకటన ఏది?
గత ఏడాది లో ప్రైమరీ మార్కెట్ తో పాటు సెకండరీ మార్కెట్ కూడా ఎన్నో కొత్త రికార్డు లు నమోదు చేసింది. అదే జోష్ కొత్త ఏడాది కూడా ఉంటుంది అని మదుపర్లు ఆశించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారో..అప్పటి నుంచి మార్కెట్ లు నెల చూపులు తప్ప లాభాల బాట పట్టడం లేదు. ఎప్పుడో ఒక్కసారి తప్ప అలా లాభాలు వచ్చాయి తప్ప... ఈ కొత్త సంవత్సరంలో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు...చూస్తూనే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రెండ్ డోనాల్డ్ ట్రంప్ ఇండియన్ మార్కెట్ లను ముంచారు అనే చెప్పొచ్చు. మోడీ తనకు మంచి ఫ్రెండ్ అని డోనాల్డ్ ట్రంప్...ట్రంప్ తనకు మంచి స్నేహితుడు అని ప్రధాని మోడీ చెప్పుకునే విషయం తెలిసిందే. కానీ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చేస్తున్న ప్రతీకార సుంకాల ప్రకటనలు ప్రపంచ స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారతీయ మార్కెట్ కూడా ట్రంప్ ప్రకటనల దెబ్బకు కుప్పకూలుతూ పోతోంది.
ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో సుంకాల అంశంపై తనతో ఏదో మాట్లాడబోగా తాను అందుకు ఛాన్స్ ఇవ్వలేదు అని...ఏ విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా చెప్పిన సంగతి తెలిసిందే. కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ పరస్పర ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలి కానీ...ఒక వైపు మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఇలా చేయటం ఏమిటి అనే చర్చ సాగుతోంది. ఒక వైపు రూపాయి దారుణ పతనం..మరో వైపు ట్రంప్ దెబ్బకు మార్కెట్లు కకావికలం అవుతున్నా కూడా భారతీయ మార్కెట్ లో భరోసా నింపే చర్యలు ఏమీ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దాఖలాలు లేవు.
గత ఏడాదే మార్కెట్ లో కరెక్షన్ స్టార్ట్ అయినా కూడా అది ఈ కొత్త సంవత్సరంలో మరింత దారుణంగా మారింది. ఒక్క ఈ వారంలోనే బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల మేర పతనం అయినట్లు గణాంకాలు చెపుతున్నాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్ల దగ్గర నుంచి బడా ఇన్వెస్టర్ల వరకు భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఒక్క శుక్రవారం నాడే బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1414 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద పది లక్షల కోట్ల రూపాయల మేర హరించుకు పోయింది. డోనాల్డ్ ట్రంప్ నిత్యం చేస్తున్న గందరగోళ ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్దానికి కారణం అయ్యే అవకాశం ఉంది అనే భయాలు మార్కెట్ లో వ్యక్తం అవుతున్నాయి. ఈ దెబ్బకు పలు కీలక షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పతనం అయ్యాయి.