Telugu Gateway
Top Stories

అలహాబాద్ హై కోర్ట్ కు బదిలీ

అలహాబాద్ హై కోర్ట్ కు  బదిలీ
X

షాకింగ్ న్యూస్. ఢిల్లీ హై కోర్టు జడ్జి ఇంట్లోని గదిలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. భారీ మొత్తం లో ఉన్న ఈ నగదు మొత్తం విలువ ఎంత అన్నది మాత్రం బయటకు రాలేదు. అయితే అగ్ని ప్రమాదంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంచలన విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా వెలుగులోకి తెచ్చింది. శుక్రవారం నాటి పేపర్ లో ఈ విషయాన్ని ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం ఢిల్లీ హై కోర్ట్ జడ్జి గా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో గత వారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో జడ్జి ఇంట్లో లేరు. ఆయన కుటుంబ సభ్యులు ఫైర్ బ్రిగేడ్ తో పాటు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడకు వెళ్లిన అధికారులు ఒక గదిలో పెద్ద ఎత్తున నగదు గుట్టలు ఉండటం గుర్తించారు. అంతే కాదు...రికవరీ చేసిన నగదు కు సంబంధించి అధికారికంగా నమోదు కూడా చేశారు. తర్వాత ఈ విషయం ఉన్నతాధికారులకు చేరటం...వాళ్ళు సమాచారాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి కు తెలియచేశారు.

దీంతో సిజెఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో వెంటనే సమావేశం అయిన కొలీజియం యశ్వంత్ వర్మను తన పేరెంట్ కోర్ట్ అయిన అలహాబాద్ హై కోర్ట్ కు బదిలీ చేశారు. ఆయన 2021 లో అక్కడ నుంచే ఢిల్లీ హై కోర్ట్ కు బదిలీ అయ్యారు. అయితే కోలీజియంలోని కొంత మంది జడ్జి లు మాత్రం న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే ఈ వ్యవహారాన్ని ట్రాన్స్ఫర్ తో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదు అంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది అని అభిప్రాయపడ్డారు. మరి కొంత మంది మాత్రం జస్టిస్ వర్మ తన పదవికి రాజీనామా చేయాలని..ఇందుకు ఆయన నిరాకరిస్తే సిజెఐ ఇన్ హౌస్ ఎంక్వయిరీ కి ఆదేశించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు.

జడ్జి లు అవినీతికి పాల్పడినట్లు..లేదా ఇతర తప్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చినా అనుసరించాల్సిన వివివిధానాలపై సుప్రీం కోర్టు 1999 లో మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం సిజెఐకి వచ్చే ఫిర్యాదు ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి నుంచి తొలుత వివరణ తీసుకోవాలి. దీనిపై సిజెఐ సంతృప్తి చెందకపోయినా..దీనిపై మరింత విచారణ అవసరం అని భావించినా కూడా సుప్రీం కోర్టు జడ్జి తో పాటు ఇద్దరు హై కోర్ట్ జడ్జి లతో అంతర్గత కమిటీ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హై కోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపుతోంది అనే చెప్పాలి.

Next Story
Share it