Telugu Gateway
Top Stories

ఫైజర్ వ్యాక్సిన్ సమర్థత 95 శాతం

ఫైజర్ వ్యాక్సిన్ సమర్థత 95 శాతం
X

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఫైజర్ నుంచి మరో ప్రకటన వచ్చింది. తొలుత వచ్చిన సమాచారం ప్రకారం ఈ వ్యాక్సిన్ సమర్థత 90 శాతం అని తెలిపారు. ఈ లోగా మోడెర్నా సంస్థ తమ వ్యాక్సిన్ సమర్థత 94.5 శాతం అని ప్రకటించింది. అంతే కాదు.సాధారణ ప్రిజ్ ల్లో కూడా దీన్ని భద్రపర్చవచ్చని ప్రకటించింది. మోడెర్నా ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఫైజర్ షేర్లు కూడా పతనం దిశగా సాగాయి. ఈ తరుణంలో ఫైజర్ వ్యాక్సిన్ సమర్థతను 90 నుంచి 95 శాతానికి పెంచటంతోపాటు భద్రతాపరంగా కూడా ఎలాంటి సీరియస్ సమస్యలు తలెత్తలేదని తెలిపింది. ఈ వ్యవహారం చూస్తుంటే ఫార్మా సంస్థలు రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను మరింత గందరగోళంలోకి నెడుతున్నట్లు కన్పిస్తోంది. అయితే ఫైజర్ కొత్తగా వచ్చిన డేటా ప్రకారం ఈ సమర్థతపై వివరాలు వెల్లడించినట్లు చెబుతోంది. అంతే కాదు..రాబోయే రోజుల్లో అత్యవసర అనుమతి కోసం అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్ డిఏ)కు అనుమతి కోసం దరఖాస్తు చేయనున్నట్లు తెలిపింది.

ఈ అనుమతి లభించిన వెంటనే అమెరికాలో అత్యవసర ప్రాతిపదికన ఈ వ్యాక్సిన్ ను ఉపయోగించనున్నారు. కరోనా ముప్పు అధికంగా ఉండే 65 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో కూడా ఈ వ్యాక్సిన్ సమర్థత 94 శాతంపైగా ఉన్నట్లు తేలిందని ఫైజర్ తెలిపింది. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల కు సంబంధించిన ప్రకటనలు రాగా రాబోయే రోజుల్లో జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్ ఫర్డ్ , ఆస్ట్రాజెనికాల వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫార్మా కంపెనీల మధ్య అసలైన పోరు ప్రారంభం కానుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it