Telugu Gateway
Top Stories

కరోనా వ్యాక్సిన్ పై ఫైజర్ సంచలన ప్రకటన

కరోనా వ్యాక్సిన్ పై ఫైజర్ సంచలన ప్రకటన
X

ప్రపంచం అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న కరోనా వ్యాక్సిన్ ల సమర్ధత ఎంత?. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అది ఏ మేర పనిచేస్తుంది?. కొంత మంది నిపుణులు అయితే 50 శాతం సమర్ధత ఉన్నా ప్రస్తుతానికి ఓకే అంటున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అయితే తమ వ్యాక్సిన్ సమర్థత 60 శాతం వరకూ ఉంటుందని ప్రకటించింది. యూకేకు చెందిన నిపుణులు తొలితరం వ్యాక్సిన్ల సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో దిగ్గజ ఫార్మా కంపెనీ ఫైజర్ సంచలన ప్రకటన చేసింది. తమ వ్యాక్సిన్ 90 శాతం మేర ఇన్ ఫెక్షన్ ను నియంత్రించే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఫలితాలు చెబుతున్నాయని పేర్కొంది. ఫైజర్ చెబుతున్నట్లు కంపెనీ సిద్ధం చేసిన వ్యాక్సిన్ 90 శాతం సమర్థతతో పనిచేస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది. కోవిడ్-19 నివారణలో తమ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని చివరి ట్రయల్స్‌ ద్వారా తెలుస్తోందని ప్రకటించింది. జర్మన్ ఔషధ తయారీదారు బయోన్‌టెక్‌తో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఫైజర్ ఈ విషయాన్ని సోమవారం నాడు ప్రకటించింది.

ఎలాంటి వైరస్ లక్షణాలు లేని ట్రయల్ వాలంటీర్లలో వ్యాధిని నివారించడంలో 90 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా తమ వ్యాక్సిన్‌ ఉందని తాజా విశ్లేషణలో తేలిందని వెల్లడించింది. తీవ్రమైన ఇతర భద్రతా సమస్యలేవీ గమనించలేదని పేర్కొంది. ఈ ఫలితాలు మరింత నిర్ధారణైతే, అత్యంత ప్రభావవంతమైన మీజిల్స్ వ్యాక్సిన్లతో సమానంగా తమ కరోనా వ్యాక్సిన్‌ ఉంటుందని వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి సంక్షోభ పరిస్థితిలో ఒక ఏడాదిలోనే వ్యాక్సిన్‌తో ముందుకు వచ్చామని, ఇది ఎవ్వరూ సాధించని గొప్ప లక్ష్యమని "ఇది చారిత్రక క్షణం" అని ఫైజర్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీకా పరిశోధన, అభివృద్ధి అధికారి కాథరిన్ జాన్సెన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది ప్రధాన విజయమని బయాన్‌టెక్‌ సీఈవో ఉగుర్ సాహిన్ తెలిపారు. తమ వ్యాక్సిన్‌ రోగనిరోధకత ప్రభావం కనీసం ఒక సంవత్సరం పాటు ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.

సిఫారసు చేయబడిన రెండు నెలల భద్రతా డేటాను సమీక్షించిన ఫైజర్ ఈ నెల చివరిలో రెండు మోతాదుల వ్యాక్సిన్ అత్యవసర అధికారం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 15 నుంచి 20 మిలియన్ల మోతాదులను తయారు చేస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. 2021 చివరికి 130 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేసేందుకు సిద్దమవుతున్నామన్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కూడా మూడవ దశ ట్రయల్స్ తో ఈ సంవత్సరాంతం నాటికి రెడీ కానుంది. అయితే దీనికి సంబంధించిన ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. మరో వైపు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి నాటికి రెడీ అయ్యే అవకాశం ఉంది. అయితే భారత ప్రభుత్వం ఆయా వ్యాక్సిన్ల పలితాలను బట్టి అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

Next Story
Share it