Telugu Gateway
Top Stories

భారత్ లోనూ వ్యాక్సిన్ వినియోగానికి ఫైజర్ దరఖాస్తు

భారత్ లోనూ వ్యాక్సిన్ వినియోగానికి ఫైజర్ దరఖాస్తు
X

అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ భారత్ లోనూ తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరింది. ఈ మేరకు నియంత్రణా సంస్థ అయిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. డిసెంబర్ 4న ఈ దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రత్యేక మినహాయింపుల ద్వారా దేశంలో ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ లేకుండానే నేరుగా వ్యాక్సిన్ దిగుమతి చేసుకుని వినియోగించటానికి అనుమతించాలని కోరారు. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూకె అనుమతి ఇఛ్చిన విషయం తెలిసిందే. ఈ వారంలో అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అంతే కాదు..డిసెంబర్ 10న అమెరికాకు చెందిన ఎఫ్ డీఏ కూడా అత్యవసర వినియోగంపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

అనుమతులు ఖచ్చితంగా వస్తాయనే ఉద్దేశంతో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ కు అమెరికాలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ తరుణంలో ఫైజర్ భారత్ కు దరఖాస్తు చేసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫైజర్ బయోఎన్ టెక్ సంస్థతో కలసి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. తమ వ్యాక్సిన్ సమర్ధత 95 శాతం వరకూ ఉన్నట్లు ఫైజర్ ప్రకటించింది. అయితే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ ను నిల్వ చేయాల్సి ఉండటం, భారత వాతావరణానికి ఇది సరిపడుతుందా లేదా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it