Telugu Gateway
Top Stories

వ్యాక్సిన్ కంపెనీల లాభాలు సెక‌నుకు 74 వేల రూపాయ‌లు.

వ్యాక్సిన్ కంపెనీల లాభాలు సెక‌నుకు 74 వేల రూపాయ‌లు.
X

వ్యాక్సిన్. ఓ పెద్ద వ్యాపారం. ఈ విష‌యంలో పెద్ద గ‌గ్గోలే న‌డిచింది. కోవిడ్ తో ప్ర‌పంచం అంతా అల్ల‌క‌ల్లోలం అయిన త‌రుణంలో కూడా ఫార్మా కంపెనీలు లాభాల గురించి ఆలోచించాయే త‌ప్ప‌..ప్రాణాలు కాపాడ‌టం అనే అంశంపై త‌క్కువ ఫోక‌స్ పెట్టాయ‌నే విమ‌ర్శ‌లు వినిపించాయి. తాజాగా ఓ సంచ‌ల‌న నివేదిక బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌పంచంలోని అగ్ర‌శ్రేణి వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌లు నిమిషానికి 74600 రూపాయ‌ల లాభం ఆర్జిస్తున్న‌ట్లు తేలింది. దిగ్గ‌జ ఫార్మా సంస్థ‌లు అయిన ఫైజ‌ర్ , మోడ‌ర్నా, బ‌యోఎన్ టెక్ ఈ ఏడాది ప‌న్నుల‌కు ముందు 34 బిలియన్ డాల‌ర్ల లాభం ఆర్జించ‌నున్న‌ట్లు ఓ నివేదిక వెల్ల‌డించింది. ఈ లెక్క‌న ఆయా సంస్థ‌ల లాభాలు సెక‌న్ కు 74,600 రూపాయ‌లుగా లెక్కించారు. ప్ర‌పంచంలోని అత్యంత పేద దేశాలు ఇప్ప‌టివ‌ర‌కూ చాలా మేర‌కు వ్యాక్సిన్ అంద‌క తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ లెక్క‌లు అన్నీ కూడా ఆయా కంపెనీల ఆదాయ అంచ‌నా నివేదిక‌ల ప్ర‌కారం త‌యారు చేసిన‌వే. విశ్లేష‌కుల గ‌ణాంకాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మ‌నీకంట్రోల్. కామ్ ఈ క‌థ‌నాన్ని తాజాగా ప్ర‌చురించింది. ఈ కంపెనీలు అన్నీ కూడా త‌మ వ్యాక్సిన్ల‌ను సంప‌న్న దేశాల‌కు మాత్ర‌మే విక్ర‌యించాయని తేల్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌లు అతి త‌క్కువ ఉండ‌టంతో ఫైజ‌ర్, బ‌యోఎన్ టెక్, మోడెర్నాలు అన్నీ కూడా లాభ‌దాయ‌క డీల్స్ చేసుకున్న దేశాల‌కే వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేసి త‌మ గుత్తాధిప‌త్యాన్ని చూపించాయి. ఫైజ‌ర్, బ‌యో ఎన్ టెక్ సంస్థ‌లు త‌మ మొత్తం వ్యాక్సిన్ ఉత్ప‌త్తిలో కేవ‌లం ఒక శాతం మాత్ర‌మే త‌క్కువ ఆదాయం ఉన్న దేశాల‌కు స‌ర‌ఫ‌రా చేశాయి. అదే మోడెర్నా అయితే ఈ స‌ర‌ఫ‌రా కేవ‌లం 0.2 శాతానికి ప‌రిమితం అయింది.

ఈ మూడు కంపెనీల‌కు భిన్నంగా ఆస్ట్రాజెనెకా, జాన్స‌న్ అండ్ జాన్స‌న్ లు మాత్రం లాభాన్ని ఆశించ‌కుండా వాస్త‌వ ధ‌ర‌కు కొంత మేర స‌ర‌ఫ‌రా చేశాయ‌ని తేల్చారు. అదే స‌మ‌యంలో ఈ కంపెనీలు వ్యాక్సిన్ కు సంబంధించిన సాంకేతిక‌త బ‌దిలీ కూడా ఏ మాత్రం ఆస‌క్తిచూప‌ని విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే దేశీయంగా వ్యాక్సిన్ త‌యారు చేసిన ప్ర‌ముఖ సంస్థ భార‌త్ బ‌యోటెక్ కూడా ముందు చెప్పిన దానికి భిన్నంగా వ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. భార‌త్ బ‌యోటెక్ ఛైర్మ‌న్ క్రిష్ణ ఎల్లా అయితే మంచినీళ్ల బాటిల్ ధ‌ర‌కే తాము వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించి..త‌ర్వాత ఈ రేటును ప్రైవేట్ గా అయితే ఏకంగా 1200 రూపాయ‌ల‌కుపైనే విక్ర‌యించారు. అటు భార‌త్ బ‌యోటెక్, సీర‌మ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లు ప్ర‌భుత్వానికి ఒక రేటు...ప్రైవేట్ కు ఒక రేటుకు వ్యాక్సిన్లు విక్రయించిన విష‌య తెలిసిందే. ఈ రెండు సంస్థ‌లు కూడా వ్యాక్సిన్ల విక్ర‌యం ద్వారా వేల కోట్ల రూపాయ‌లు లాభాలు గ‌డించాయ‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ధ‌ర‌ల్లో వ్య‌త్యాసాల‌పై కోర్టులు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి

Next Story
Share it