పేటీఎం షేరు ధర 2150 రూపాయలు
దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ ద్వారా పేటీఎం రికార్డు నెలకొల్పబోతుంది. పేటీఎం వ్యవస్థాపక సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ ఐపీవోకి సంబంధించి కంపెనీ షేర్ల ధరను నిర్ణయించింది. ఈ ప్రైస్ బ్యాండ్ 2080-2150 రూపాయల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ ఐపీవో నవంబర్ 8న ప్రారంభం అయి 10వ తేదీన ముగియనుంది. గతంలో కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూ ఓ రికార్డు కాగా..ఇప్పుడు పేటీఎం దీన్ని దాటేస్తోంది. కోల్ ఇండియా అప్పట్లో 15 వేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి సమీకరించింది. పీపీవో పేటీఎం సంస్థ అంచనా విలువ 20 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని లెక్కగడుతున్నారు. ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈతోపాటు ఎన్ ఎస్ఈలో కూడా లిస్ట్ అవుతాయి. పేటీఎం అతి తక్కువ సమయంలో అత్యధిక బ్రాండ్ విలువ కంపెనీగా అవతరించింది.
ఇప్పుడు సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకూ ప్రతి నిత్యం అవసరం అయ్యే చెల్లింపులకు పేటీఎం యాప్ ను వాడుతున్న విషయం తెలిసిందే. మొబైల్ ఆధారిత చెల్లింపుల యాప్ వివిధ రకాల సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పేటీఎం దీపావళి నాటికి లిస్టింగ్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా జాప్యం జరిగింది. పేటీఎం షేర్లలో మదుపు చేసేందుకు చాలా మంది మదుపరులు ఆసక్తిచూపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఐసీవో ద్వారా సమీకరించే నిధులను కంపెనీ ప్రస్తుత కార్యకలాపాల బలోపేతం తోపాటు కొత్త వ్యాపార రంగాల్లో ప్రవేశానికి కొనుగోళ్లు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఉపయోగించనున్నారు. పేటీఎంలో ప్రస్తుతం 10 వేలకు పైగా ఉద్యగులు ఉన్నారు.