పేటీఎం షేర్లు..కొత్త కనిష్టానికి
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన ప్రముఖ సంస్థ పేటీఎం షేర్లు మదుపర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. లిస్టింగ్ దగ్గర నుంచి ఇప్పటివరకూ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆఫర్ ధరను అందుకోలేదు ఈ కంపెనీ షేరు. అంతే కాదు..తాజాగా ఈ షేరు కొత్త కనిష్ట స్థాయిని తాకింది. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఒక్కోటీ 2150 రూపాయల ధరతో షేర్లను ఆఫర్ చేసి మార్కెట్ నుంచి 18300 కోట్ల రూపాయలను సమీకరించిన విషయం తెలిసిందే. అయితే లిస్టింగ్ రోజే ఇన్వెసర్టకు ఈ షేరు షాక్ ఇచ్చింది. ఆఫర్ ధర 2150 రూపాయలు కాగా..ఇప్పటివరకూ ఈ షేరు ధర 1961 రూపాయలను మించలేదు.అయితే తాజాగా పేటీఎం షేర్లు కొత్త కనిష్టానికి చేరాయి.
ఓ దశలో 1150 రూపాయలకు తగ్గి..చివరకు బీఎస్ ఈలో 1157 రూపాయల వద్ద ముగిసింది. ప్రముఖ ఆర్ధిక సేవల కంపెనీ మాక్వైరీ పేటీఎం షేర్లను అండర్ పెర్ ఫార్మ్ రేటింగ్ ఇవ్వటంతో ఈ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ సంస్థ ఈ షేర్ టార్గెట్ ధరను 900 రూపాయలుగా నిర్ణయించింది. పేటీఎం ఆదాయాలు 26 శాతం ఉంటాయని అంచనా వేసి మాక్వైరీ..ఇప్పుడు వాటిని 23 శాతానికి తగ్గించింది. గత కొంత కాలంగా పేటీఎం నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు రాజీనామాలు చేయటం కూడా ఆందోళనకర అంశంగా ఉందన్నారు.