Telugu Gateway
Top Stories

పేటీఎం మ‌దుప‌ర్ల విషాదం!

పేటీఎం మ‌దుప‌ర్ల విషాదం!
X

ఈ మ‌ధ్య కాలంలో ఏ షేరు కూడా ఇంత ఒత్తిడిని ఎదుర్కొని ఉండ‌దు. ఐపీవో స‌మ‌యంలో ఎక్క‌డా లేని జోష్ చూపించిన పేటీఎం లిస్టింగ్ ద‌గ్గ‌ర నుంచి మ‌దుప‌ర్లకు షాక్ లు ఇస్తూనే ఉంది. లిస్టింగ్ స‌మ‌యంలో ఏకంగా ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు చేరిన ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ఇప్పుడు ఏకంగా స‌గానికిపైనే త‌గ్గి 43,798.08 కోట్ల రూపాయ‌ల‌కు ప‌రిమితం అయింది. 2150 రూపాయ‌ల‌తో మార్కెట్లోకి వ‌చ్చిన ఈ షేరు ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ రోజు కూడా ఆఫ‌ర్ ధ‌ర‌ను అందుకోలేదు. అంతే కాదు..లిస్టింగ్ స‌మ‌యం నుంచి ప‌లు రేటింగ్ ఏజెన్సీలు ఆఫ‌ర్ ధ‌ర‌ను ఓవ‌ర్ వ్యాల్యూగా చెబుతూ వ‌చ్చారు. ఈ షేరు అస‌లు ధ‌ర 900 రూపాయ‌లే అని కొన్ని ఏజెన్సీలు పేర్కొన్నాయి. క‌నీసం ఈ ధ‌ర ద‌గ్గ‌ర అయినా నిల‌క‌డ‌గా ఉంటుంద‌ని ఆశించిన వారికి మ‌రింత చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ కంపెనీకి సంబంధించి ప్ర‌తికూల వార్త‌లు వ‌స్తుండ‌టంతో అంత‌కంత‌కూ ఇది ప‌త‌నం అవుతూనే ఉంది. తాజాగా ఆర్ బిఐ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై ఆంక్షలు విధించటంతో ఈ షేరు ధర సోమ‌వారం నాడు కొత్త క‌నిష్ట స్థాయి 662 రూపాయ‌ల‌కు చేరింది. చివ‌ర‌కు కొంత కొలుకుని వంద రూపాయ‌ల నష్టంతో 675 రూపాయ‌ల వ‌ద్ద ముగిసింది. దీంతో మ‌దుప‌ర్లు మ‌రింత విల‌విల‌లాడారు. ఈ త‌రుణంలో మ‌రో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇది ఖ‌చ్చితంగా స్టాక్ పై మ‌రింత ప్ర‌తికూల ప్ర‌భావం చూపించే అంశ‌మే. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు విదేశాల్లోని సర్వర్‌లకు డేటాను అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదికలో పేర్కొన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

చైనా ఆధారిత సంస్థలతో కంపెనీ సర్వర్లు సమాచారం పంచుకుంటున్నాయని ఆర్ బిఐ వార్షిక తనిఖీల్లో గుర్తించాయని బ్లూమ్ బెర్గ్ నివేదిక చెబుతోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో పలు చైనా కంపెనీలు పరోక్షంగా వాటాను కలిగి ఉన్నాయి. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ, జాక్ మాస్ యాంట్ గ్రూప్ కో పేటీఎంలో వాటాలను కల్గి ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఈవార్త‌ల‌పై కంపెనీ తీవ్రంగా స్పందించింది. అవన్నీ పూర్తిగా తప్పుడు ఆరోపణలు అని పేర్కొంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు సంబంధించిన డేటాను ఎవరితో పంచుకోలేదని స్ప‌ష్టం చేసింది. డేటా స్థానికీకరణపై ఆర్ బిఐ ఆదేశాలను పేటీఎం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. బ్యాంకుకు సంబంధించిన డేటా మొత్తం భారత్‌లోనే ఉందని తెలిపింది. పూర్తి స్వదేశీ బ్యాంకుగా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఉన్నందుకు గర్విస్తున్నామని కంపెనీ తెలిపింది. తాజా వార్త‌ల ప్ర‌భావం పేటీఎంపై ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it