Telugu Gateway
Top Stories

పేటీఎం కామెడీ..2150 కు షేర్లు అమ్మి...532 రూపాయలకు కొనుగోలు

పేటీఎం కామెడీ..2150 కు షేర్లు అమ్మి...532 రూపాయలకు కొనుగోలు
X

డిజిటల్ పే మెంట్స్ , ఆర్థిక సేవల కంపెనీ పేటీఎమ్ ఐపీఓ కింద షేర్లను ఒక్కొక్కటి 2150 రూపాయలకు అమ్మింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి 18300 కోట్ల రూపాయలు సమీకరించింది. ఇది అంతా 2021 నవంబర్ లో సాగింది. ఆ తర్వాత పేటీఎమ్ షేర్లు ఆఫర్ ధర కంటే తక్కువగా 1950 రూపాయల వద్ద లిస్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పేటీఎమ్ షేర్లు ఆఫర్ ధరకు చేరుకోలేదు. అంతే కాదు..చాలా రోజుల పాటు కొత్త కొత్త కనిష్ఠస్థాయిలకు చేరుతూ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది ఏకంగా ఈ షేర్ 52 వారాల కనిష్ట స్థాయి 439 రూపాయలు అయితే..ఇదే కాలంలో గరిష్ట స్థాయి 1035 రూపాయలు మాత్రమే. ఐపీఓ లో అప్లయ్ చేసిన ఇన్వెస్టర్లు ఇంకా షేర్లు అమ్ముకోకపోతే వాళ్ళ నష్టం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఇన్వెస్టర్లకు 2150 రూపాయల లెక్కన షేర్లు అమ్మిన ఈ కంపెనీ ఇప్పడు ఒక్కో షేర్ ను 532 రూపాయల లెక్కన బై బ్యాక్ చేస్తోంది.

కంపెనీ కొత్తగా 3 .25 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఈ మేరకు కంపెనీ గురువారం నాడు స్టాక్ మార్కెట్ కు సమాచారం ఇచ్చింది. 2022 డిసెంబర్ లో కంపెనీ 850 కోట్ల రూపాయల షేర్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. సహజంగా కంపెనీలు మిగులు నిధులు ఉన్న సమయంలో, కొన్ని షేర్ ధర మరింత పతనం అవ్వకుండా ఉండటానికి...ప్రమోటర్ల వాటా పెంచుకోవటానికి ఇలా బై బ్యాక్ మార్గాలను ఎంచుకుంటాయి. అయితే పేటీమ్ మాత్రం షేర్ ధర మరింత పతనం కాకుండా చూసుకోవటానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెపుతున్నారు. పేటీమ్ ఏడాది తర్వాత ఇన్వెస్టర్లకు వాటాలను అమ్మిన ధర కంటే ఇంత తక్కువ ధరకు బై బ్యాక్ చేయటం చర్చనీయాంశగా మారింది.

Next Story
Share it