ఒప్పో ఇండియా సుంకాల ఎగవేత 4389 కోట్ల రూపాయలు

Oppo India.భారత్ లో మరో చైనా కంపెనీ అక్రమాలు వెలుగు చూశాయి. ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా ఏకంగా 4389 కోట్ల రూపాయల మేర సుంకాలు ఎగవేసిందని డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వెల్లడించింది. ఒప్పో ఇండియా ప్రధాన కార్యాలయంతోపాటు ఈ కంపెనీకి చెందిన కీలక అధికారుల నివాసాల్లోనూ డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒప్పో ఇండియా దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల విషయంలో తప్పుడు డిక్లరేషన్స్ ఇచ్చినట్లు పక్కా ఆధారాలను డీఆర్ఐ అధికారులు సేకరించారు. ఇదే అంశంపై ఒప్పో సీనియర్ అధికారులను డీఆర్ఐ అధికారులు ప్రశ్నించారు. భారత అధికారులు వరస పెట్టి చైనా కంపెనీల అక్రమాలను వెలికితీస్తున్నారు. ఇటీవలే చైనాకే చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మోసాలను కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) గుర్తించింది. అ సమయంలో ఆ సంస్థ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విదేశీ పరిశ్రమలకు భారత్ తప్పుడు సంకేతాలు పంపుతోందని ఆక్రోశం వెళ్ళగక్కింది. ఖాతాల ను నిలిపివేయటంతో వివో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇలా ఖాతాలను నిలిపివేయటం వల్ల తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని పేర్కొంది. అయితే బుధవారం నాడు వివోకు కోర్టులో కొంత ఊరట లభించింది. బ్యాంకుల ఖాతాలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ..945 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది.
అదే సమయంలో 250 కోట్ల రూపాయల బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఆయా ఖాతాలను ఆపరేట్ చేసుకోవచ్చని తెలిపింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు, బ్యాంకు ఖాతాల స్వాధీనంపై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, జస్టిస్ సుబ్రమణియంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. పన్నులు ఎగవేసేందుకు దేశంలో ఆదాయాన్ని తక్కువ చూపించి కోట్ల రూపాయలను చైనాకు తరలించిందనే ఆరోపణలపై ఈడీ జూలై 5న దేశవ్యాప్తంగా వివో కార్యాలయాలపై విస్తృత దాడులు చేసింది. భారత్‌లో పన్నులు ఎగవేసేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో 2017-21 మధ్యకాలంలో రూ.62,476 కోట్ల టర్నోవర్‌ను చైనాలోని మాతృసంస్థకు తరలించిందని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.



