విమానాల్లో ఇక ఒక చేతి బ్యాగుకే అనుమతి
విమాన ప్రయాణికులకు అలర్ట్. ఇక నుంచి విమానాల్లో ఒక చేతి బ్యాగ్ ను మాత్రమే అనుమతించనున్నారు. ఇప్పటి వరకూ చాలా మంది ప్రయాణికులు రెండు నుంచి మూడు చిన్న బ్యాగులను క్యారీ చేస్తున్నారని..దీని వల్ల పలు సమస్యలు వస్తున్నందున ఇక నుంచి విధిగా ఒక బ్యాగ్ ను మాత్రమే అనుమతించాలని విమానాశ్రయాల్లో భద్రతా వ్యవహారాలను చూసే కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ (సీఐఎస్ఎఫ్) నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా సర్కులర్ జారీ చేసింది. విమానాశ్రయ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు ఇందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రయాణికులు పలు చేతి బ్యాగులు తీసుకు రావటం వల్ల స్క్రీనింగ్ పాయింట్ వద్ద జాప్యం జరుగుతోందని, దీని వల్ల విమానం ఎక్కటానికి ముందు జరిగే భద్రతా తనిఖీ పాయింట్ల వద్ద రద్దీ ఏర్పడుతుందని నోట్ లో పేర్కొన్నారు. పౌరవిమానయాన భద్రతా బ్యూరో నిబంధనల ప్రకారం ఇక నుంచి ఒక చేతి బ్యాగును మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనను ఎయిర్ లైన్స్, విమానాశ్రయ ఆపరేటర్లు విధిగా పాటించాలని సీఐఎస్ఎఫ్ ఆదేశించింది. ఎయిర్ లైన్స్ తమ టిక్కెట్స్ తోపాటు ఇతర మార్గాల ద్వారా తమ ప్రయాణికులకు ఒకే చేతి బ్యాగు నిబంధనను తెలియజేయాలలని సూచించింది. విమానాశ్రయాల్లోనూ దీనికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు.