డిల్లీలో వారాంతపు కర్ఫ్యూ
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. ఒమిక్రాన్ తోపాటు కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు ఆంక్షలు అమల్లో ఉండగా..శని, ఆదివారాల్లో పూర్తిగా కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈ సమయంలో అత్యవసర సేవలు మినహా ఎలాంటి ఇతర కార్యక్రమాలకు అనుమతించరు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్వల్ప లక్షణాలతో కరోనా బారినపడ్డారు. కర్ఫ్యూ ఈ వారం నుంచే ప్రారంభం కానుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. సోమవారం ఒక్క రోజే ఢిల్లీలో నాలుగు వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.
ఢిల్లీలో వచ్చే వారం నాటికి కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.. అదే సమయంలో ఆస్పత్రుల్లో చేరికలు కూడా పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 15 నాటికి ఢిల్లీలోనే రోజుకు 25 వేల కేసులు నమోదు అవుతాయని భావిస్తున్నారు. భారత్ లో థర్డ్ వేవ్ తన ప్రతాపం చూపించం ప్రారంభం అయింది. జనవరి నెలాఖరు నాటికి ఎంత తీవ్ర స్థాయికి చేరుకుంటుందనే టెన్షన్ లో ప్రజలు ఉన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. అదే సమయంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.