అందుకే నౌకలపై ఇరాన్ దాడులు!

శాంతి ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో అసలు ఇరాన్ ఎందుకు నౌకలపై దాడులు చేస్తోంది. దీని వెనక ఉన్న కథ ఏంటి?. నౌకలపై దాడి చేసింది అని చెప్పి ఇరాన్ పై మళ్ళీ అమెరికా దాడులకు దిగటం...ఇరాన్ కూడా అంతే గట్టిగా ప్రతి దాడులు చేయటం వెనక కారణాలు ఏంటి?. అమెరికా పైకి చెపుతున్నది ఒకటి..చేస్తున్నది మరొకటి. మొత్తంగా మీద హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు తొలగించి...ఈ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని అమెరికా చూస్తోంది. ఇందుకు హర్ముజ్ కు అనుకుని ఉండే ఒమన్ ను అమెరికా ఉపయోగించుకుంటోంది. హర్ముజ్ జలసంధి నుంచి కాకుండా అమెరికా ఒమన్ సమీపం లో కొత్త షిప్పింగ్ రూట్ ను డెవలప్ చేసింది. అమెరికా నేవీ వెడల్పు అయిన ఈ మార్గాన్ని డెవలప్ చేసి..రక్షణ కల్పిస్తూ నౌకల రవాణాకు మార్గం సుగమం చేస్తోంది. ఇరాన్ నియంత్రణలో ఉన్న హర్ముజ్ జలసంధి రూట్ లో కాకుండా ఈ కొత్త రూట్ లో నౌకా యానాన్ని నడిపించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
హర్ముజ్ పై పట్టును వదులుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడని ఇరాన్ తాము చెప్పిన రూట్ లో కాకుండా అమెరికా నిర్దేశించిన మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపైనే దాడులకు దిగుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదే ఇప్పుడు మరో సారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తలకు కారణం అవుతోంది. ఏదిఏమైనా కూడా హర్ముజ్ పై కంట్రోల్ వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. ఇరాన్ రెవల్యూషనరీ కోస్ట్ గార్డ్స్ ( ఐఆర్ జీసి) మాత్రం తాము చెప్పిన మార్గంలోనే నౌకలు ప్రయాణించాలని ఆదేశిస్తోంది. కాదు కూడదు అంటే దాడులు తప్పవన్న చందంగా వేరే మార్గంలో వెళ్లే నౌకలపైనే దాడులకు దిగుతున్నారు. ఒమన్ కారిడార్ నుంచి నౌకల ప్రయాణాన్ని అనుమతిస్తే అది తమ ఉనికికే ప్రమాదం అని ఇరాన్ భయపడుతోంది.
అందుకే తాము నిర్దేశించిన మార్గం కాకుండా వేరే రూట్ లో వెళితే దాడులు చేయటానికి కూడా ఇరాన్ ఏ మాత్రం వెనకాడటం లేదు. తాజా ఉద్రిక్తతల కారణంగా ఇప్పుడు మళ్ళీ పర్షియన్ గల్ఫ్ లో పలు నౌకలు చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భారత్ కు చెందిన పలు నౌకలు కూడా ఉన్నట్లు చెపుతున్నారు. ఇప్పుడు వీటిని సురక్షితంగా ఈ ప్రాంతం నుంచి బయటపడేందుకు గల అవకాశాలపై భారత్ కు చెందిన అధికారులు దృష్టి సారించారు. మరో వైపు బుధవారం రాత్రి మరో సారి ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడులకు దిగబోతున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చెపుతున్నారు. హర్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం తిరిగి స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని...అయితే ఇది ఒక్క ఇరాన్ కు మాత్రమే వర్తిస్తుంది అని తెలిపారు. అవసరం అయితే తాము ఇరాన్ విద్యుత్ గ్రిడ్, నీటి సదుపాయాలపై దాడులు చేస్తామని అంటూనే..ఆ అవసరం వస్తుంది అని తాను భావించటం లేదు వ్యాఖ్యానించారు.



