Telugu Gateway
Top Stories

ఓలా..విల విల

ఓలా..విల విల
X

ఓలా ఎలక్ట్రిక్ షేర్ల పతనం ఆగేదెప్పుడు?. ఇదే ఇప్పుడు ఈ కంపెనీ షేర్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న. గత కొన్ని రోజులుగా వివిధ కారణాలతో ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర తగ్గుతూ వస్తోంది. జూన్ 23 న ఇది కొత్త కనిష్ట స్థాయికి పతనం అయింది. సోమవారం నాడు ఈ కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి 43 రూపాయలకు పతనం అయ్యాయి. దీంతో అధిక ధరల వద్ద ఈ షేర్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు భారీ ఎత్తున నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి. అంతే కాదు ఐపీఓలో ఈ షేర్లు దక్కించుకున్న వాళ్లకు కూడా పెద్ద ఎత్తున నష్టాలే మిగిలాయి అని చెప్పాలి. ఎందుకంటే ఈ కంపెనీ 76 రూపాయల ధరతో ఐపీఓ కు రాగా 2024 ఆగస్ట్ లో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 91 రూపాయల వద్ద నమోదు అయ్యాయి. తర్వాత ఏకంగా ఈ షేర్ ధర 157 రూపాయల గరిష్ట స్థాయికి తాకింది. 52 వారాల గరిష్ట ధరతో పోలిస్తే ఇప్పుడు కంపెనీ షేర్ 72 శాతం మేర పతనం అయినట్లు అయింది. ఇదే ఇప్పుడు ఈ కంపెనీ ఇన్వెస్టర్లలో గుబులు రేపుతున్న అంశం.

సోమవారం నాడు మార్కెట్ లో 44 లక్షల ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 44 రూపాయల వద్ద బ్లాక్ డీల్ లో చేతులు మారాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగి మూడు రూపాయల నష్టంతో బిఎస్ఈ లో 43. 32 రూపాయల వద్ద క్లోజ్ అయ్యాయి. గత ఏడాది లో కంపెనీ తీవ్ర గడ్డు పరిస్థితి ని ఎదుర్కొంది. ముఖ్యంగా వాహనాల కొనుగోలు దారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటం..సర్వీస్ సమస్యలు తలెత్తడంతో ఓలా బ్రాండ్ కు నష్టం జరిగింది అనే చెప్పాలి. దీంతో పాటు నియంత్రణ సంస్థల నుంచి కూడా కంపెనీ పలు సవాళ్లు ఎదుర్కొంది. వీటికి తోడు ఎప్పటి నుంచో ఈ రంగంలో ఉన్న సంస్థల నుంచి ఓలా కు గట్టి పోటీ ఎదురుకావడంతో అప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో టాప్ లో ఉన్న కంపెనీ వాటా క్రమంగా తగ్గటం మొదలైంది. ఇవి అన్నీ కలిసి ఓలా స్టాక్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాము లాభాల బాట పడతామని కంపెనీ యాజమాన్యం చెపుతున్నా కూడా ఈ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతూనే ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ షేర్లను ట్రాక్ చేస్తున్న పలు సంస్థలు ప్రస్తుత ధరలో ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చు అని చెపుతుంటే కోటక్ సెక్యూరిటీస్ మాత్రం ఈ షేర్లు 30 రూపాయలకు పతనం అయ్యే అవకాశం ఉంది అన్నీ తాజాగా వెల్లడించింది. కంపెనీ భారీ నష్టాలను చవిచూడటం..పెరుతున్న పోటీ, ఇతర సవాళ్ల కారణం ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది పేర్కొంది. ఈ షేర్లు ఐపీవో ధరకు చేరుకోవాలన్నా కూడా ఇన్వెస్టర్లు ఓపికతో ఎదురు చూడక తప్పని పరిస్థితి మార్కెట్లో ఉంది అనే చెప్పాలి.

Next Story
Share it