భవిష్ అగర్వాల్ వెర్సస్ కునాల్ కమ్రా
గత కొంతకాలంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వీటిలో తరచూ సమస్యలు తలెత్తుతుండటమే. ఓలా స్కూటర్లలో పెద్ద ఎత్తున సమస్యలు వస్తుండంతో వీటిని పరిష్కరించేందుకు కంపెనీ కూడా పెద్ద ఎత్తున సర్వీస్ టీంల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది. అప్పటికే ఓలా బ్రాండ్ పై ప్రతికూల ప్రచారం స్టార్ట్ అయింది. ఈ తరుణంలో ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా ఓలా స్కూటర్ల సర్వీస్ సమస్యలపై ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. దీనికి ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తీవ్రంగా స్పందిస్తూ ఇది పెయిడ్ పోస్ట్ అని..ఇలా పెట్టే బదులు తమ సర్వీస్ సెంటర్లలో సేవలు అందిస్తే నీ ఫెయిల్యూర్ షో ల ద్వారా వచ్చే డబ్బులకంటే అధికంగానే చెల్లిస్తాను అంటూ కామెంట్ చేశారు. తర్వాత ఇద్దరి మధ్య వాదనలు మరింత ముదిరాయి. ఓలా ఎలక్ట్రిక్ లిస్టెడ్ కంపెనీ. కునాల్ కమ్రా పాపులర్ కమెడియన్ కావటంతో ఆయన పోస్ట్ తో పాటు కంపెనీ సీఈఓ, ఆయన మధ్య సాగిన వాదన కూడా సోషల్ మీడియా లో వైరల్ అయింది.
ఫలితం సోమవారం నాడు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఎనిమిది శాతంపైగా నష్టపోయి 91 రూపాయల వద్ద క్లోజ్ అయింది. ఒక దశలో 89 .71 రూపాయలకు పతనం అయింది. గత కొన్ని రోజులుగా ఓలా షేర్లు తగ్గుతూ వస్తున్నాయి. దీనికి కునాల్ కమ్రా ట్వీట్ మరింత ఆజ్యం పోసింది అనే చెప్పొచ్చు. 52 వారాల గరిష్ట స్థాయి 157 రూపాయలతో పోలిస్తే ఈ షేర్లు 43 శాతం మేర నష్టపోయాయి. ఒక సారి మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ పై అయినా నెగిటివ్ ప్రచారం మొదలైతే దాన్నుంచి బయటపడాలి అంటే ఎంతో శ్రమించాలి. అప్పటికి అది సాధ్యం అవుతుంది అని గ్యారంటీగా చెప్పలేం. ఇటీవలే స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలెక్ట్రిక్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుందో వేచిచూడాల్సిందే.
ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా షేర్ వరసగా తగ్గుతూ వస్తోంది. ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ సంస్థల నుంచి ఓలా కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ తరుణంలో సీఈఓ భవిష్ అగర్వాల్ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సింది పోయి ..బహిరంగంగా వివాదాలకు దిగటం సరికాదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ డిజిటల్ మీడియా యుగంలో ఏ ప్రోడక్ట్ కంపెనీ అయినా ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ప్రత్యర్థుల ఎత్తుగడలు కూడా ఉంటాయి. మార్కెట్ లో ఉన్న తర్వాత అన్ని విషయాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీలదే అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.