Telugu Gateway
Top Stories

ఓలా ఎలక్ట్రిక్ ...ఎందుకిలా !

ఓలా ఎలక్ట్రిక్  ...ఎందుకిలా !
X

దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహించేందుకు పలు రకాల చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆటోమొబైల్ రంగంలోని దిగ్గజ కంపెనీలు అన్ని కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల బాట పట్టడమే కాకుండా..ఈ విభాగంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కస్టమర్ల కు చుక్కలు చూపిస్తున్నాయి కూడా. దీనికి సంబంధించి మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో పాటు దిగ్గజ సంస్థల నుంచి ఎదురు అవుతున్న పోటీతో ఓలా క్రమ క్రమంగా తన మార్కెట్ వాటాను కూడా కోల్పోతోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఈవీ వాహనాల విభాగంలో ముందు ఉన్న ఓలా ఇప్పుడు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఆగస్ట్ లో ఐపీఓ కి వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ నుంచి 6145 కోట్ల రూపాయలు సమీకరించింది.

ఐపీఓ కి వచ్చిన తర్వాత కంపెనీ షేర్ 158 రూపాయల గరిష్ట స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా వరసగా నష్టపోతున్న ఓలా షేర్ సోమవారం నాడు మరింత తగ్గి వంద రూపాయల దిగువన క్లోజ్ అయింది. సోమవారం నాడు బిఎస్ ఈ లో ఒక దశలో 98 రూపాయల కనిష్ట స్థాయికి చేరి తర్వాత 99 . 70 రూపాయల వద్ద ముగిసింది. ఇది ఇప్పుడు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఓలా షేర్ పతనం ఎక్కడ ఆగుతుందో అన్న టెన్షన్ మదుపరుల్లో ఉంది. వాహన కొనుగోలుదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ చెపుతున్నా ఇవేమి ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపలేకపోతున్నాయి. మరి ఈ గడ్డు కాలాన్ని ఓలా ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Next Story
Share it