Telugu Gateway
Top Stories

52 వారాల కనిష్ట స్థాయికి పతనం

52 వారాల కనిష్ట స్థాయికి పతనం
X

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు విల విల లాడుతున్నాయి. మంగళవారం నాడు ఈ షేర్లు ఏకంగా 52 వారాల కనిష్ట స్థాయి 74 .82 రూపాయలకు పతనం అయ్యాయి. కొద్ది రోజుల క్రితమే 158 రూపాయలకు చేరిన కంపెనీ షేర్ ధర అతి తక్కువ రోజుల్లోనే 75 రూపాయలకు పతనం అయింది. ఓలా 2024 ఆగస్ట్ లోనే ఐపీవోకి వచ్చి మార్కెట్ నుంచి 6145 కోట్ల రూపాయలు సమీకరించిన విషయం తెలిసిందే. 76 రూపాయలతో కంపెనీ షేర్లు జారీ చేయగా..ఇప్పుడు అవి ఆఫర్ ధర కంటే దిగువకు పతనం అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ కంపెనీ షేర్ బిఎస్ఈ లో 75 .18 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఓలా షేర్ ధర భారీ పతనానికి ప్రధాన కారణం గత కొన్ని రోజులుగా ఈ కంపెనీ ఉత్పతుల్లో వస్తున్న సమస్యలే. దీంతో ఓలా అటు కస్టమర్ల నుంచి వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

కంపెనీ వాహనాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు రావటం...ఈ ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వంలో పలు సంస్థలు కూడా స్పందించి కంపెనీకి నోటీసు లు కూడా జారీ చేశాయి. అయితే ఓలా ఇటీవలే ఫిర్యాదుల్లో 99 శాతం పైగా పరిష్కరించినట్లు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సిసిపీఏ)కి సమాధానం కూడా ఇచ్చింది. అయితే తమకు వచ్చిన ఫిర్యాదులు..కంపెనీ సమాధానాన్ని కూడా సరిచూడనున్నట్లు సిసిపీఏ వెల్లడించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఓలా ఎంత త్వరగా తన ఈవి వాహనాల్లో సర్వీస్ సమస్యలను పరిష్కరించుకుంటే అంత త్వరగా గాడిన పడే అవకాశం ఉంది అని లేక పోతే కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ తగిలే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఓలా ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎర్నస్ట్ అండ్ యంగ్ సేవలను పొందుతోంది. తొలి విడతగా ఆరు నెలలు ఈ సేవలు పొందనున్నట్లు చెపుతున్నారు. మరి ఓలా ను తాజా గండం నుంచి ఎర్నస్ట్ అండ్ యంగ్ ఏ మేరకు బయటపడేస్తుందో చూడాలి.

Next Story
Share it