Telugu Gateway
Top Stories

ఏటీఎఫ్ కొరత తో సర్వీసులు కట్

ఏటీఎఫ్ కొరత తో సర్వీసులు కట్
X

హర్ముజ్ జలసంధిలో ఇదే పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగితే పలు దేశాల్లో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే పలు ఎయిర్ లైన్స్ తమ తమ సర్వీసుల్లో భారీ ఎత్తున కోత విధించాయి. హర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోవటంతో పలు దేశాల్లో విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ విషయంలో ముఖ్యంగా యూరప్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. యూరప్ దగ్గర కేవలం ఐదు నుంచి ఆరు వారాలకు సరిపడా మాత్రమే ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయి అని..చమురు రవాణా సాధారణ స్థితికి చేరుకోకపోతే మాత్రం తీవ్ర సమస్యలు తప్పవు అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఇటీవల హెచ్చరించింది. ఈ ప్రకటన వచ్చి కూడా ఇప్పటికే వారం రోజులు దాటింది.

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ లు చేస్తున్న యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విమాన టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. ఇండియా లో కూడా పలు ఎయిర్ లైన్స్ ప్రయాణికులపై పెద్ద ఎత్తున సర్ చార్జీల భారం మోపాయి. దీనికి ప్రధాన కారణం ఏటీఎఫ్ ధరలు గణనీయంగా పెరగటమే. దీంతో దేశీయ రూట్లతో పాటు అంతర్జాతీయ రూట్లలో కూడా విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వేసవి సెలవుల్లో హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా పెరిగిన విమాన టికెట్ ధరలను చూసి వెనక్కి తగ్గాల్సిన పరిష్టితి ఏర్పడింది అంటే ఈ ధరల ప్రభావం ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. పలు అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ మే నెలలో తమ తమ సర్వీసుల్లో భారీ ఎత్తున కోత విధించబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20 ప్రధాన ఎయిర్ లైన్స్ లో 19 తమ సర్వీసులను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Next Story
Share it