Telugu Gateway
Top Stories

విమానం గాల్లో ఉండగా ఇంజన్స్ ఆపేశాడు!

విమానం గాల్లో ఉండగా ఇంజన్స్  ఆపేశాడు!
X

ఇది నిజంగా వణుకు పుట్టించే వార్త. విమానం వేల అడుగుల ఎత్తులో గాల్లో ఎగురుతుండగా విధుల్లో లేని పైలట్ ఒకరు ఇంజన్స్ ఆపివేసే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన పైలట్. కో పైలట్ లు ఈ ప్రమాదం నుంచి అటు ప్రయాణికులను...ఇటు విమానాన్ని కాపాడారు. లేకపోతే పెద్ద ప్రమాదమే చోటు చేసుకునేది. అమెరికా కు చెందిన అలస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన హారిజాన్ ఫ్లైట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో లేని పైలట్ కాక్ పిట్ లో ఉండే అదనపు సీట్ లో కూర్చుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో విమానంలో ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఆ పైలట్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

సిబ్బంది తో కలిసి 83 మంది ప్రయాణికుల హత్యకు కుట్ర చేసిన అబియోగంతో పోలీస్ లు ఈ పైలట్ జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ ను అరెస్ట్ చేశారు. వాషింగ్టన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఈ విమానాన్ని పోర్ట్ ల్యాండ్ కు దారిమళ్లించి డేవిడ్ ఎమర్సన్ ను పోలీసులకు అప్పగించారు. ఇంజన్స్ ఆపివేయటానికి ప్రయత్నించిన పైలట్ ను వెంటనే కాక్ పిట్ నుంచి బయటకు తీసుకువచ్చి సంకెళ్లు వేసి మరీ వెనక సీట్ లో కూర్చోబెట్టారు. అదే సమయంలో విమానంలోని పైలట్ లు జరిగిన విషయాన్ని ఏటీసీ కి తెలియచేశారు. లైవ్ ఏటీసీ వెబ్ సైట్ పైలట్ లు, ఏటీసీ మధ్య జరిగిన సంభాషణలను బయటపెట్టింది. ఈ ప్రమాదం నుంచి బయటపడటంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story
Share it