Telugu Gateway
Top Stories

తప్పు ఒప్పుకున్న జెన్సన్

తప్పు ఒప్పుకున్న జెన్సన్
X

ఎన్విడియా. ప్రపంచంలోనే కృత్రిమ మేధకు ఈ సంస్థ బ్యాక్ బోన్ గా నిలిచింది. హై ఎండ్, ఏఐ చిప్ మార్కెట్ లో ఈ సంస్థ అగ్రగ్రామిగా ఉంది. దీంతోనే ఒక్కసారిగా ఈ కంపెనీ పేరు మారుమోగిపోయింది... అమెరికా మార్కెట్ లో కూడా ఈ కంపెనీ షేర్లు దూసుకెళ్లటంతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంపద కూడా అమాంతం పెరిగింది. అయితే నిన్న మొన్నటి వరకు ఎన్విడియా పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం ఒకటి అయితే...ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మరో కారణంతో ఆ సంస్థ...సంస్థ సీఈఓ పేరు గత కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తోంది. అంతే కాదు...ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది పెద్ద దుమారానికి కారణం అయింది. ప్రపంచ ప్రఖ్యాత చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ, కోఫౌండర్ జెన్సన్ హువాంగ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. స్వయంగా ఆయనే తాను తప్పు చేసినట్లు అంగీకరించారు. గత కొన్ని రోజులుగా ఆయన తన వ్యక్తిగత వ్యవహారాలు, చైనా గూఢచర్య ఆరోపణలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన భార్యకు నమ్మకద్రోహం చేశానని అంగీకరించిన జెన్సన్ .. తమ సంస్థ ఉద్యోగులకు ఓ లేఖ రాశారు.

'నా భార్యకు, కుటుంబానికి నేను క్షమాపణ చెప్పాలి. నేను చేసిన పని వల్ల.. ఆమెకు, పిల్లలకు బాధను మిగిల్చాను. నేను చేసిన తప్పుకు ఎలాంటి సమర్థనా లేదు. నా కుటుంబం నాపై చూపిన ప్రేమ, నమ్మకానికి తగినట్లు నేను నడుచుకోలేకపోయాను. నా తప్పులకు పూర్తి బాధ్యత నాదే' అని హువాంగ్ పేర్కొన్నారు. తన భార్య, కుటుంబ సభ్యుల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అంతేకాకుండా ఎన్విడియా సంస్థ ఉద్యోగులు, బోర్డు డైరెక్టర్లు, భాగస్వాములు, వాటాదారుల విశ్వాసాన్ని కూడా మళ్లీ పొందాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఎన్విడియాకు నాయకత్వం వహించడమనేది ఓ గొప్ప అవకాశమని, సంస్థ పట్ల తన నిబద్ధతలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు.మరోవైపు.. హువాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న అలైస్ హువాంగ్ అనే చైనా మహిళ ద్వారా ఎన్విడియా అత్యాధునిక ఏఐ చిప్‌లకు సంబంధించిన సమాచారం, కీలక వివరాలను బీజింగ్‌కు చేరుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపాయి.

సింగపుర్‌కు చెందిన డేటా సెంటర్ సంస్థ మెగాస్పీడ్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న ఆమె.. చైనా నిఘా వ్యవస్థకు సహకరిస్తున్నారని అమెరికా నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు.. హువాంగ్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. జాతీయ భద్రతకు సంబంధించిన ఆరోపణలపై జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తానని జెన్సన్ తన లేఖలో వెల్లడించారు. అమెరికా జాతీయ భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ.. ఇది అంతర్గత కార్పొరేట్ వ్యవహారమని, దీనిపై తానేం మాట్లాడానన్నారు.మరో వైపు కంపెనీ అధికారులు ఈ అంశంపై స్పందిస్తూ జాతీయ భద్రతకు చెందిన అంశాలతో పాటు..కంపెనీ విషయాలు ఏమీ లీక్ కాలేదు అని వెల్లడించారు.

జెన్సన్ పై తమకు పూర్తి నమ్మకం ఉంది అని...విచారణకు ఆయన సహకరిస్తారు అన్నారు. చైనా కు చెందిన అలైస్ ఆ దేశ గూఢచారిగా అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. అమెరికా ఆంక్షలు దాటుకుని ఎన్విడియా ఏఐ చిప్ లను చైనాకు చేరవేస్తుంది అనే ఆరోపణలు రావటంతో అమెరికా ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. మరో వైపు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై స్పదించారు. జెన్సన్ మంచి వ్యక్తి అని చెపుతూ...అమెరికా కోసం ఆయన ఎంతో అద్భుతంగా పనిచేశారు అన్నారు. జెన్సన్ పై వచ్చిన ఆరోపణలపై తాను ఆయనతో మాట్లాడలేదు అన్నారు. తన ఆసియా పర్యటనలో జెన్సన్ హువాంగ్ ను తీసుకెళ్లటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏమైనా కొత్త మలుపులు తీసుకుంటుందా లేక అంతా సర్దుకుంటుందా అన్నది కొద్దిరోజులు పోతే కానీ తేలదు.

Next Story
Share it