ఎన్ఎస్ఈ...జియో ఐపీవోలు వరసగా!

దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో రెండు అతి పెద్ద ఐపీవో లకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే సెబీ రిలయన్స్ జియో ఐపీవో కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ...శుక్రవారం నాడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ కి కూడా ఆమోదం తెలిపింది. దీంతో రాబోయే రెండు, మూడు నెలల కాలంలోనే ప్రైమరీ మార్కెట్ నుంచి కేవలం రెండు సంస్థలు కలిపి దగ్గర దగ్గర 67000 కోట్ల రూపాయలు సమీకరించబోతున్నాయి. రిలయన్స్ జియో కంటే ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూనే తొలుత మార్కెట్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఎన్ఎస్ఈ ఐపీవో ద్వారా 30000 వేల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి సమీకరించనుంది. ఈ ఇష్యూ మొత్తం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్ ) విధానంలో ఉండనుంది. సెప్టెంబర్ 18 నుంచి ఎన్ఎస్ఈ ఐపీవో మొదలు అయ్యే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. వచ్చే వారం దీనికి సంబంధించిన వివరాలు మొత్తం వెల్లడి అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్ఎస్ఈ ఐపీవో ఎప్పుడో పదేళ్ల క్రితమే రావాల్సి ఉన్నా కూడా కో లొకేషన్ వివాదంతో పాటు పలు పరిపాలనా అంశాలు కారణంగా అనుమతి దక్కలేదు. ఇప్పుడు అన్ని అడ్డంకులను అధిగమించి ఎన్ఎస్ఈ ఐపీఓకు వస్తోంది.
ఎన్ఎస్ఈ లో ఆరు శాతం వాటాలను అంటే 14 .89 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుత వాటాదారులే ఈ షేర్లు విక్రయిస్తున్నారు తప్ప కొత్తగా షేర్లు జారీ చేయటం లేదు. ఐదు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువతో ఎన్ఎస్ఈ లో వాటాలను విక్రయించనున్నారు. ఎన్ఎస్ఈ ఐపీవో పూర్తి అయితే ఇప్పటి వరకు దేశంలో నమోదు అయిన అతి పెద్ద ఐపీఓగా ఇది నిలుస్తుంది. ఇప్పటి వరకు ఈ రికార్డు హ్యుండయ్ మోటార్ ఇండియా పేరుతో ఉంది. ఈ సంస్థ ఐపీవో ద్వారా మార్కెట్ నుంచి 27870 కోట్ల రూపాయలను సమీకరించింది. ఎన్ఎస్ఈ ఐపీవో అలా పూర్తి అవుతుందో లేదో ఆ వెంటనే రిలయన్స్ జియో ఐపీవో మొదలవుతుంది. ఈ సంస్థ మార్కెట్ నుంచి 37000 వేల కోట్ల రూపాయలు సమీకరించే అవకాశం ఉంది. రిలయన్స్ జియో ఐపీవో దసరా లేదా దీపావళి సమయంలో ఉంటుంది ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నెలాఖరు నాటికీ రిలయన్స్ జియో యాజమాన్యం ఐపీవో తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ ఐపీవో పూర్తి అయితే దేశంలో ఇప్పటి వరకు అతి పెద్ద ఐపీవో ప్లేస్ ను రిలయన్స్ జియో దక్కించుకుంటుంది. ఆ తర్వాత ప్లేస్ లో ఎన్ఎస్ఈ, హ్యుండయ్ మోటార్ఇండియా లిమిటెడ్ లు ఉంటాయి. ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని రిలయన్స్ జియో అప్పులు తీర్చటానికి వినియోగించనుంది



