Telugu Gateway
Top Stories

గ‌డ్క‌రీకి క్రెడిట్ కార్డు నిరాక‌రించిన ఐసీఐసిఐ బ్యాంక్

గ‌డ్క‌రీకి క్రెడిట్ కార్డు నిరాక‌రించిన ఐసీఐసిఐ బ్యాంక్
X

రిల‌య‌న్స్ 3600 కోట్ల‌కు కోట్ చేసిన ప‌నిని 1600 కోట్ల‌కే పూర్తి చేశాం

గ‌డ్క‌రీ గత స్మృతులు

కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఇటీవ‌ల ఓ స‌మావేశంలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు పంచుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఒక‌ప్పుడు త‌న‌కు క్రెడిట్ కార్డు ఇవ్వ‌టానికి నిరాక‌రించింద‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న మ‌హారాష్ట్ర మంత్రి. ఇదే విషయాన్ని అప్ప‌టి ఐసీఐసీఐ ఎండీ కె వి కామ‌త్ కు చెపితే త‌న‌కు కార్డు ఇప్పించార‌న్నారు. అయితే లాయ‌ర్లు, రాజ‌కీయ నాయ‌కుల‌కు క్రెడిట్ కార్డు ఇవ్వ‌కూడ‌ద‌నేది త‌మ బ్యాంకు విధానం అని కామ‌త్ తెలిపార‌న్నారు. అంతే కాదు మ‌హారాష్ట్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తాను తీసుకున్న నిర్ణ‌యం ధీరూభాయ్ అంబానీ, బాలాసాహెబ్ థాక‌రేల‌ను నిరుత్సాహ‌ప‌ర్చాయ‌ని గుర్తుచేసుకున్నారు. జాతీయ ర‌హ‌దారుల్లో పెట్టుబ‌డి అవ‌కాశాలు అనే అంశంపై నిర్వ‌హించిన జాతీయ స‌మావేశంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యాలు వెల్ల‌డించిన‌ట్లు ఫైనాన్సియ‌ల్ ఎక్స్ ప్రెస్ ప‌త్రిక వెల్ల‌డించింది. తొలి బిజెపి, శివ‌సేన ప్ర‌భుత్వంలో తాను ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్ మెంట్ (పీడ‌బ్ల్యూడీ) శాఖ మంత్రిగా ప‌నిచేశాన‌ని...అయితే 1995 సంవ‌త్స‌రంలో తాను పెట్టుబ‌డుల సాధించేందుకు ప‌డిన క‌ష్టాల‌ను గుర్తుచేసుకున్నారు. ముంబ‌య్-పూణే ఎక్స్ ప్రెస్ హైవే ప‌నులకు రిల‌య‌న్స్ టెండ‌ర్ వేసింద‌ని తెలిపారు. అయితే తాను ఆ టెండ‌ర్ ను తిర‌స్క‌రించాన‌ని..అప్పుడు ధీరూబాయ్ అంబానీ కూడా ఉన్నార‌ని గుర్తుచేసుకున్నారు. ఈ నిర్ణ‌యంతో ఆయ‌న చాలా నిరాశ‌కు గుర‌య్యార‌ని తెలిపారు. అయితే అప్ప‌టి సీఎం మ‌నోహ‌ర్ జోషి, బాలాసాహెబ్ థాకరే కూడా ఈ నిర్ణ‌యంతో నిరాశ‌కు గురై ఎందుకు ఇలా చేశావ‌ని ప్ర‌శ్నించార‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి నిధులు స‌మీక‌రించి ఎక్స్ ప్రెస్ వేను పూర్తి చేయ‌టంతోపాటు వ‌ర్లి-బాంద్రా సీ లింక్ ను ప్రాజెక్టును, 55 ఫ్లైఓవ‌ర్ల‌ను పూర్తి చేస్తాన‌ని చెపితే అంద‌రూ న‌వ్వార‌న్నారు. నా ఐడియాను సీఎం మ‌నోహ‌ర్ జోషి మెచ్చుకున్నా..దీనిపై ఆయ‌న‌కు న‌మ్మ‌కం మాత్రం కుద‌ర‌లేద‌న్నారు. అయినా ముందుకెళ్ళ‌టానికి అనుమ‌తించ‌టంతో అప్పుడు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఎంఎస్ఆర్ డీసీ)ని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. తానే వ్య‌వ‌స్థాప‌క ఛైర్మ‌న్ గా ఉన్న‌ట్లు తెలిపారు.

ఎండీ ఆర్ సీ సిన్హా ప‌నిచేశార‌ని వెల్ల‌డించారు. అప్పట్లో తాము ల్యాప్ టాప్ లు తీసుకుని పెట్టుబ‌డుల కోసం ప‌లు సంస్థ‌ల చుట్టూ తిరిగామ‌ని, ఇప్పుడు పెట్టుబ‌డిదారులే త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నార‌ని తెలిపారు. 500 కోట్ల రూపాయ‌ల సేక‌ర‌ణ‌కు ఎంఎస్ఆర్ డీసీ క్యాపిట‌ల్ మార్కెట్లోకి ప్ర‌వేశించగా..తాము 1160 కోట్లు అందుకున్నామ‌న్నారు. రెండ‌వ‌సారి 650 కోట్ల రూపాయ‌ల స‌మీక‌ర‌ణ‌కు వెళ్తే 1100 కోట్ల రూపాయ‌లు వ‌చ్చాయ‌న్నారు. రిల‌య‌న్స్ ఈ ఎక్స్ ప్రెస్ ప‌నులకు 3600 కోట్ల రూపాయ‌లు కోట్ చేస్తే ఎంఎస్ ఆర్ డీసీ అదే ప‌నిని అందులో స‌గం కంటే త‌క్కువ‌కు 1600 కోట్ల రూపాయ‌ల‌కు పూర్తి చేశామ‌న్నారు. ర‌త‌న్ టాటా కూడా త‌మ కంటే స్మార్ట్ గా ప‌నులు చేస్తున్నారంటూ ప్ర‌శంసించార‌ని గ‌డ్క‌రీ తెలిపారు. మౌలిక‌స‌దుపాయాల ప్రాజెక్టుల కోసం అంత మొత్తం నిధులు స‌మీక‌ర‌ణ సాధ్యం అవుతుంద‌ని అప్ప‌ట్లో తాను కూడా ఊహించ‌లేద‌న్నారు. ఆ స‌మ‌యంలోనే తాను ఉన్న విమానంలోనే ఐసీఐసీఐ ఎండీ కామ‌త్ కూడా ప్ర‌యాణిస్తున్నార‌ని..త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి తాము చేసిన పనిని కొనియాడార‌న్నారు. అప్పుడే ఐసీసీఐ బ్యాంక్ త‌న క్రిడెట్ తిర‌స్క‌రించిన విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పిన‌ట్లు తెలిపారు.

Next Story
Share it