తమిళనాడు, బీహార్ ల్లోనూ రాత్రి కర్ఫ్యూ
కరోనా కేసుల పెరుగుదల దేశాన్ని వణికిస్తోంది. ఇఫ్పటికే ముంబయ్, ఢిల్లీ వంటి నగరాల్లో వారాంతపు కర్ఫ్యూతోపాటు పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు కూడా రాత్రి కర్ఫ్యూకు నిర్ణయం తీసుకున్నాయి. తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ పది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకూ అమలు చేయనున్నారు. ఈ సమయంలో ప్రైవేట్ తో సహా ఏ వాహనాలు తిరగటానికి వీల్లేదని పేర్కొన్నారు.
ఆటోలు, ట్యాక్సీలను కూడా అనుమతించరు ఈ సమయంలో. ఆదివారం పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఏప్రిల్ 20 నుంచి పార్కులు, బీచ్ ల్లోకి కూడా ప్రజలను అనుమతించరాదని నిర్ణయించారు. నీలగిరి, కొడైకెనాల్ సహా పలు పర్యాటక ప్రాంతాల్లో ఎవరినీ అనుమతించేదిలేదని ప్రభుత్వం వెల్లడించింది. బీహార్ లో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు సీఎం నితీష్ కుమార్ తెలిపారు.