Telugu Gateway
Top Stories

ఢిల్లీలో టపాసులపై నవంబర్ 30 వరకూ నిషేధం

ఢిల్లీలో టపాసులపై  నవంబర్ 30 వరకూ నిషేధం
X

ధేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఓ వైపు కరోనా..మరో వైపు తీవ్ర కాలుష్యం. ఇంతలో దీపావళి పండగ వచ్చేసింది. టపాసుల కాలుష్యం వల్ల కరోనా ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ సర్కారు ఇప్పటికే దీపావళి టపాసుల అమ్మకం, వినియోగంపై నిషేధం విధించింది. అంతే కాదు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తామని ప్రకటించింది. సోమవారం నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి నవంబర్ 30 వరకూ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి గాను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో బాణాసంచా వినియోగానికి అనుమతిస్తే.. పరిస్థితి మరింత దిగజారిపోతుందనే ఉద్దేశంతో ట్రిబ్యూనల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్జీటీ తాజా ఉత్తర్వులు నేషనల్‌ క్యాపిటర్‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌)లో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 2 డజనుకు పైగా జిల్లాలకు వర్తిస్తుంది.

అంతేకాక దేశవ్యాప్తంగా "గత ఏడాది నవంబర్‌లో సగటు పరిసర గాలి నాణ్యత" అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. అలానే గాలి నాణ్యత మోడరేట్‌గా ఉన్న నగరాలు, పట్టణాల్లో తక్కువ కాలుష్య కారకాలుగా పరిగణించబడే గ్రీన్‌ క్రాకర్స్‌ ని మాత్రమే అనుమతించింది. ఇక గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ఇతర ప్రాంతాల్లో ట్రిబ్యూనల్‌ క్రాకర్స్‌ నిషేధాన్ని ఐచ్చికం చేసింది. కరోనాను దృష్టిలో పెట్టుకుని గాలి కాలుష్యానికి కారణం అయ్యే చర్యలని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి" అని ఎన్‌జీటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయ్ లో కూడా జనావాసాల మధ్య టపాసులు కాల్చటంపై నిషేధం విధించారు.

Next Story
Share it