Telugu Gateway
Top Stories

బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు చిక్కుల్లో మోడీ స‌ర్కారు

బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు చిక్కుల్లో మోడీ స‌ర్కారు
X

కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై విపక్షాలు మండిప‌డుతున్నాయి. పెగాసెస్ స్పైవేర్ కు సంబందించి న్యూయార్క్ టైమ్స్ తాజాగా ప్ర‌చురించిన సంచ‌ల‌న క‌థ‌నం తో మోడీ స‌ర్కారు మ‌రోసారి చిక్కుల్లో ప‌డ‌నుంది. అది కూడా బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న ముందు ఈ విష‌యం వెలుగులోకి రావ‌టంతో స‌ర్కారు దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఈ స్పైవేర్‌ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతోపాటు పెగాసస్ స్పైవేర్ భాగమేనని నివేదిక పేర్కొంది. పెగాసస్ వ్యవహారంపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఎన్‌ఎస్ఓ సంస్థకు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో భారత్ సహా పలు దేశాల్లో జర్నలిస్ట్‌లు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసినట్టు బయటకు రావడంతో వివాదం చెలరేగింది.

'ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైబర్‌వెపన్ కోసం యుద్ధం'' పేరుతో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఎస్ఓ తన సాఫ్ట్‌వేర్‌ను పలు నిఘా సంస్థలు, చట్టాలను అమలుచేసే సంస్థలకు దశాబ్దం కాలం నుంచి విక్రయిస్తోందని తెలిపింది. తమ సాఫ్ట్‌వేర్‌కు సాటి మరేదీ లేదని, ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లను స్థిరంగా, విశ్వసనీయంగా ట్రాక్ చేయగలదని వాగ్దానం చేసిందని పేర్కొంది. జులై 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఇజ్రాయేల్ పర్యటన వెళ్లగా.. దీని గురించి కూడా నివేదిక ప్రస్తావించింది. పర్యటన సమయంలో ఇరుదేశాల మధ్య 2 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరిందని, ఈ డీల్‌లోనే పెగాసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అనంతరం బెంజిమిన్ నెతన్యాహు భారత్‌లో పర్యటించారని, జూన్ 2019లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో ఇజ్రాయేల్‌కు మద్దతుగా పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు పరిశీలకుల హోదాను నిరాకరించడానికి భారత్ ఓటు వేసిందని నివేదిక పేర్కొంది.

న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్ర‌జాస్వామ్య సంస్థ‌లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జ‌ల‌పై నిఘా పెట్టేందుకు మోడీ ప్ర‌భుత్వం పెగాసెస్ ను కొనుగోలు చేసింద‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు, సాయుధ బ‌ల‌గాలు, న్యాయ‌వ్య‌వ‌స్థ ఇలా అంద‌రూ ఫోన్ ట్యాపింగ్ కు గుర‌య్యారు. ఇది దేశ ద్రోహం, మోడీ ప్ర‌భుత్వం దేశ ద్రోహ‌నికి పాల్ప‌డింద‌ని మండిప‌డ్డారు.శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది మాట్లాడుతూ పెగాసెస్ స్పైవేర్ తో దేశాన్ని బిగ్ బాస్ హౌస్ లా మార్చార‌ని మండిప‌డ్డారు. స్పైవేర్ ర‌క్షణ‌ప‌రంగా కాకుండా రాజ‌కీయ నేతలు, ప్ర‌తిప‌క్షాల‌పై నిఘాకు ఉప‌యోగించ‌టం దారుణ‌మ‌న్నారు. బిజెపి ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి కూడా ఈ అంశంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 300 కోట్ల రూపాయ‌లు పెట్టి పెగాసెస్ స్పైవేర్ ను కొనుగోలు చేశార‌నే క‌థ‌నాల‌ను ఖండించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం ప్రాథ‌మికంగా పార్ల‌మెంట్ ను, సుప్రీంకోర్టును త‌ప్పుదారి ప‌ట్టించిన‌ట్లు నిరూపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు.

Next Story
Share it