Telugu Gateway
Top Stories

ఊపిరిపీల్చుకుంటున్న వేళ 'కొత్త ఉప‌ద్రవం'

ఊపిరిపీల్చుకుంటున్న వేళ కొత్త ఉప‌ద్రవం
X

ప్ర‌పంచం అంతా ఊపిరిపీల్చుకుంటున్న వేళ కొత్త ఉప‌ద్ర‌వం. చాలా దేశాలు క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాయి. భార‌త్ లోనూ ఇక థ‌ర్డ్ వేవ్ కు ఛాన్స్ ఉండ‌దు అనుకుంటున్న వేళ హ‌ఠాత్తుగా వ‌చ్చిప‌డిన వార్త మ‌ళ్లీ అంద‌రినీ ఆందోళ‌న‌లోకి నెట్టింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతోపాటు దేశంలోని ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అప్ర‌మ‌త్తం అయి కొత్త వేరియంట్ వైర‌స్ వెలుగుచూసిన త‌రుణంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హించారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అయితే ఇప్ప‌టికే ప‌లు ఆంక్షలు అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా నుంచి వ‌చ్చే వారు విధిగా క్వారంటైన్ లో ఉండాల‌ని..వారి ద‌గ్గ‌ర నుంచి శాంపిల్స్ తీసుకుని ప‌రీక్షల‌కు పంపాల‌ని నిర్ణ‌యించారు. అంతే కాదు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్త‌యిన వారిని మాత్ర‌మే రాష్ట్రంలోకి అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అయితే వెంట‌నే దక్షిణ ఆఫ్రికా నుంచి వ‌చ్చే విమానాల‌ను అనుమ‌తించ‌వ‌ద్ద‌ని ప్ర‌ధాని మోడీని కోరారు. దక్షిణ ఆఫ్రికాతోపాటు ఇప్ప‌టికే ఈ కేసులు వ్యాపించిన దేశాల విష‌యంలో కూడా ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకోవాల‌న్నారు.ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ కొత్త వేరియంట్ వెలుగులోకి వ‌చ్చిన త‌రుణంలో దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికలను సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారులను కోరారు. కొత్త వేరియంట్‌కు సంబంధించిన పరిణామాలపై క్లుప్తంగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా 'ప్రమాదంలో' ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించి, అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ అధికారుల‌కు దిశా, నిర్దేశం చేశారు. దేశంలోని ప్ర‌జ‌లు అంద‌రూ ముఖానికి మాస్క్‌ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలనిసూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని.. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. ప‌లు దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్ప‌టికే బోట్స్ వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. తాజాగా జ‌ర్మ‌నీ, చెక్ రిప‌బ్లిక్ దేశాల్లోనూ ఈ కేసులు వ‌చ్చాయి.

Next Story
Share it