Telugu Gateway
Top Stories

వచ్చే బడ్జెట్ లోనే కేటాయింపులు !

వచ్చే బడ్జెట్ లోనే కేటాయింపులు !
X

కేంద్రంలోని మోడీ సర్కార్ సంస్కరణల పేరుతో ఎప్పటి నుంచో విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇది అంత ఈజీ గా ముందుకు సాగే వ్యవహారం కాకపోవటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ సారి మాత్రం దీని కోసం పక్కా ప్రణాళికతో రాబోతున్నట్లు కనిపిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల డిస్కంలు భారీ ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉచిత విద్యుత్ తో పాటు పలు పథకాల వల్ల ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు...దేశంలోని ఎక్కువ రాష్ట్రాల్లోని డిస్కంల ఆర్థిక పరిస్థితి దారుణంగానే ఉంది అని చెప్పాలి. డిస్కంలు అన్ని భారీ ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇదే అదనుగా మోడీ సర్కార్ వచ్చే బడ్జెట్ లో కీలక ప్రతిపాదనతో ముందుకు రాబోతోంది. దీని కోసం ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించబోతుంది. డిస్కంల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు కేంద్రం అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వనుంది. అయితే ఈ రుణాలు తీసుకోవాలంటే కేంద్రం పెట్టిన షరతుల ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రైవేటీకరణ చేయాల్సి ఉంటుంది.

ఇందుకు కేంద్ర విద్యుత్ శాఖ రెండు మోడల్స్ ను సిద్ధం చేసినట్లు రాయిటర్స్ తన కథనంలో వెల్లడించింది. మొదటి మోడల్ ప్రకారం, రాష్ట్రాలు కొత్త విద్యుత్ పంపిణీ సంస్థను స్థాపించి, అందులో 51% వాటాను విక్రయించవచ్చు. దీనివల్ల ప్రైవేటీకరించిన సంస్థ రుణాలకు 50 ఏళ్లపాటు వడ్డీ లేని రుణం, అలాగే ఐదేళ్లపాటు తక్కువ వడ్డీతో కూడిన కేంద్ర ప్రభుత్వ రుణాలు పొందే అవకాశం ఉంటుందని ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. రెండవ మోడల్ ప్రకారం, రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలో గరిష్టంగా 26% వాటాను ప్రైవేటు రంగానికి విక్రయించవచ్చు. దీని బదులుగా, ఐదేళ్లపాటు తక్కువ వడ్డీ రుణాలను కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉంటుందని అందులో పేర్కొన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను ఆదుకునేందుకు ఈ విధానం తెస్తున్నట్లు చెపుతున్నా కూడా ఈ కీలక రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఈ విధానాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది అనే వాదన వినిపిస్తోంది.

దేశంలోని అన్ని రాష్టాల్లో కలుపుకుంటే విద్యుత్ సంస్థల అప్పుల మొత్తం ఏడు లక్షల కోట్ల రూపాయలపై మాటగానే ఉంది. వివిధ విభాగాల వాళ్లకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నందున పంపిణీ సంస్థలు ఆర్థికంగా కష్టాల్లోనే ఉన్నాయని కేంద్రం సిద్ధం చేసిన నివేదిక చెపుతోంది. వివిధ వర్గాలకు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలకు ఆ చెల్లింపులు మాత్రం చేయటం లేదు. కేంద్రం తీసుకురాబోతున్న ఈ సంస్కరణల వల్ల దేశంలోని ప్రైవేట్ విద్యుత్ సంస్థలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది అని చెపుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగిన ఉద్యోగులు..ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటంతో ఇది ఆగిపోయింది. ఈ సారి ప్రభుత్వం మోడల్ మార్చి ముందుకు వస్తుండంతో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. అయితే కొంత మంది మాత్రం విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు ముఖ్యంగా ఆర్థికంగా..నిర్వహణపరంగా మెరుగు పడాలంటే ప్రైవేట్ పరం చేయకతప్పదు అనే వాదన తెరమీదకు తెస్తున్నారు. అయితే ఇదే జరిగితే రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ తో పాటు ఇతర వర్గాలకు ఇచ్చే సబ్సిడీ లపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉంది అన్నది మరికొంత మంది వాదన.

Next Story
Share it