Telugu Gateway
Top Stories

ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులు

ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులు
X

నిజంగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాట వినటం లేదా?. లేక ఇద్దరూ కలిసి ఇరాన్ లో తమ టార్గెట్ లు అన్నీ పూర్తి చేసుకోవటానికి ఒక ప్లాన్ గా వెళుతున్నారా ?. ఇవే అనుమానాలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తమతో ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ప్రాధేయపడింది అని..ఇక ఒప్పందం చేసుకోవటమే తరువాయి అని ఈ యుద్ధం మొదలైన తర్వాత ఎన్ని సార్లు చెప్పారో లెక్కేలేదు. కానీ ఇంతవరకు అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదు. కొద్ది రోజుల క్రితమే డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మరీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. అయినా సరే ఇజ్రాయెల్ ఏ మాత్రం తన వైఖరి మార్చుకున్నట్లు కనిపించటం లేదు. ఒక వైపు శాంతి ఒప్పందం అమల్లో ఉన్నా సరే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు చేస్తుండంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఏకంగా పది క్షిపణులను ఇరాన్ ఉత్తర ఇజ్రాయెల్ వైపు ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఢిఫెన్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ధ్రువీకరించాయి. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు దిగింది. శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇరాన్ పై ఈ స్థాయిలో దాడులు జరగటం ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు.

అమెరికా అప్పుడప్పుడు ఆత్మరక్షణ పేరుతో చిన్న దాడులు చేసినా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగటంతో మళ్ళీ యుద్ధం మొదటికి వచ్చినట్లు అయింది అనే భయం పలు దేశాల్లో వ్యక్తం అవుతోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో కువైట్, ఇరాక్‌లు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్ మిసైల్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో మరోసారి సైరెన్లు మోగాయి. ప్రజలు షెల్టర్లలో తలదాచుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం అలర్ట్స్ జారీ చేసింది. ఇరాన్‌కు చెందిన 10 మిసైల్స్‌ను ఇజ్రాయెల్ మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పలు మిసైల్స్‌ను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ దళాలు కూడా వెల్లడించాయి. ప్రతీకారం తప్పదని హెచ్చరించాయి. ‘ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడింది. మేము మరింత పవర్‌ఫుల్‌గా దాడి చేస్తాము. శత్రువు ఆత్మవిశ్వాసం సడలిపోయేలా విరుచుకుపడతాము’ అని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ఫీ డెఫ్రిన్ హెచ్చరించారు.

ఇరాన్‌పై ప్రతికార దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కట్టడి చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ప్రతీకార దాడులకు దిగింది. డోనాల్డ్ ట్రంప్ మాటలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ మాత్రం ముందుకే వెళుతోంది. ఇరాన్ తో తాము ఒప్పందానికి దగ్గరకు వచ్చామని...ఈ తరుణంలో కొత్తగా దాడులు సరికాదు అని డోనాల్డ్ ట్రంప్ చెపుతున్నట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ టెహ్రాన్ తో పాటు తబ్రీజ్, ఇస్ఫహన్ లపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఏప్రిల్ 8 తర్వాత ఈ స్థాయిలో దాడులు జరగటం ఇదే మొదటి సారి. తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ లు పరస్పరం దాడులు చేసుకోవటంతో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి. తాజా దాడులతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మరింత పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పై కూడా ఈ ప్రభావం పడనుంది.

Next Story
Share it