నీట్ పేపర్ లీక్...సీబీఎస్ఈ మూల్యాంకనం లో గోల్ మాల్

మెడికల్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విషయంలో విద్యా శాఖ ఘోరంగా విఫలం అయినట్లు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందా?. లీక్ అయిన పరీక్ష స్థానంలో కొత్తగా నిర్వహించనున్న నీట్ పరీక్షను ప్రధాని నరేంద్ర మోడీ, పీఎంఓ స్వయంగా నీట్ పరీక్షను పర్యవేక్షించనున్నారు అని కేంద్రం సుప్రీం కోర్ట్ కు చెప్పింది అంటే దీని అర్ధం ఏమిటి?. కేంద్ర విద్యా శాఖ...ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయంలో ఘోరంగా విఫలం అయినట్లు ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లు అయింది అన్న చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది. 2024 సంవత్సరంలో కూడా నీట్ పరీక్షకు సంబంధించి గందరగోళం చెలరేగింది. కొంత మంది విద్యార్థులకు మళ్ళీ పరీక్ష నిర్వహించారు. అంతకు ముందు అంటే 2015 లో కూడా పేపర్ లీక్ అయి మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. 2016 లో అంతర్ రాష్ట్రాల మధ్య పేపర్ లీక్ జరగటంతో అక్కడ మాత్రమే పరీక్ష తిరిగి నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా నీట్ పరీక్షలో గందరగోళం తలెత్తుతున్నా కూడా లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశంలో మోడీ సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్ధం అవుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఒక వైపు నీట్ వివాదం ఇలా సాగుతుండగానే సీబీఎస్ఈ , 10 , 12వ తరగతి ఫలితాల మూల్యాంకన ప్రక్రియలో కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్‌స్క్రీన్ మార్కింగ్' (ఓఎస్ఎం ) విధానం తీవ్ర వివాదాస్పదమైంది. స్కాన్ చేసిన కాపీలలో ఒకరి పేపర్లు మరొకరికి మారడం, మొత్తం గందరగోళంగా మారటంతో మార్కుల తారుమారు వంటి తీవ్ర అవకతవకలు జరిగాయని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. సీబీఎస్ఈ కూడా పొరపాట్లు జరిగాయి అని కూడా అంగీకరించింది. తప్పులను సరిద్దుతున్నామని చెపుతోంది. ఒక వైపు నీట్ పేపర్ లీక్ ...మరో వైపు సీఈబీఎస్ఈ పేపర్ల మూల్యాంకనంలో చోటు చేసుకున్న గందరగోళంతో కేంద్ర విద్యా శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరో వైపు సుప్రీం కోర్ట్ కూడా నీట్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన అంశంలో బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించింది. మరో వైపు విద్యా శాఖ దిగ్గజ ఐటి కంపెనీలను కాదని ..గతంలో తెలంగాణాలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదురుకొంటున్న కంపెనీ ప్రమోటర్లకు చెందిన సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు.



