Telugu Gateway
Top Stories

రుణదాతల అభ్యంతరాలు పట్టించుకోని ట్రిబ్యునల్

రుణదాతల అభ్యంతరాలు పట్టించుకోని ట్రిబ్యునల్
X

ప్రభుత్వాలు...బ్యాంకులు...ట్రిబ్యునల్స్ బడా బడా బాబుల విషయంలో ఎంత ఉదారం గా వ్యవహరిస్తాయో ఈ వ్యవహారం చూస్తే స్పష్టం అవుతోంది. ఇది చూసిన వాళ్ళు ఎవరైనా అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సిఎల్ టి) ఇచ్చిన ఆదేశాలు అందరూ ఆశ్చర్య పోయేలా ఉన్నాయి మరి. అది ఎవరి విషయంలో అంటారా మీడియా దిగ్గజం జీ గ్రూప్ ఫౌండర్ సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా వెలువడ్డ ఆదేశాలు ఇవి. తాజాగా దివాలా పరిష్కార ట్రిబ్యునల్ ( ఎన్ సిఎల్ టి ) సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో సమర్పించిన రుణ చెల్లింపు ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళిక ప్రకారం సుమారు రూ.22,006.57 కోట్లుగా అంగీకరించిన రుణదాతల క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు సుభాష్ చంద్ర కేవలం రూ.6.5 కోట్లు చెల్లించనున్నారు. దీంతో రుణదాతలకు దాదాపు 99.97 శాతం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల బిజినెస్ పత్రిక ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది . ఎన్ సి ఎల్ టి సభ్యుడు (జ్యుడీషియల్) నిలేష్ శర్మ, మూడో సభ్యుడిగా వ్యవహరిస్తూ ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబిసి) లోని సెక్షన్ 114 కింద ఈ రుణ చెల్లింపు ప్రణాళికకు ఆమోదం తెలిపారు. రుణదాతలు చేసిన అభ్యంతరాలను ఆయన తిరస్కరించారు. రికవరీ మొత్తం చాలా తక్కువగా ఉందని, అలాంటి ప్రణాళికకు ఆమోదం ఇవ్వకూడదని వారు వాదించారు. వాస్తవానికి ఇంతకు ముందు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు చెందిన ఇద్దరు సభ్యులు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలతో తీర్పు ఇచ్చారు. దీంతో ట్రిబ్యునల్ అధ్యక్షుడు నిలేష్ శర్మను మూడో సభ్యుడిగా నియమించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ మెజారిటీ నిర్ణయంతో తాజా ఆదేశాలు వెలువరించింది.

అయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నేతృత్వంలోని భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన రుణదాతల వాదనలను శర్మ తిరస్కరించారు. ప్రతిపాదించిన చెల్లింపు "ఆచరణ సాధ్యం కానిది, చట్టవిరుద్ధమైనది" అని వారు వాదించారు. సుమారు రూ.22,006.57 కోట్ల అంగీకరించిన క్లెయిమ్‌లకు గాను రుణదాతలకు కేవలం రూ.6.25 కోట్లు, అలాగే ప్రక్రియకు సంబంధించిన ఖర్చుల కోసం రూ.25 లక్షలు చెల్లించాలని ఈ ప్రణాళికలో ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఎన్ సిఎల్ టి ఆదేశాల్లో వారి వాదనలను నమోదు చేస్తూ, ఎల్ఐసి హోసింగ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ విషయంలో, అంగీకరించిన క్లెయిమ్ మొత్తం రూ.1,322.39 కోట్లు కాగా, ప్రతిపాదించిన చెల్లింపు కేవలం రూ.38,09,294 మాత్రమే. అంటే అంగీకరించిన బకాయిల్లో సుమారు 0.028 శాతం మాత్రమే. ఇంత స్వల్ప మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికకు ఈ ట్రిబ్యునల్ ఆమోదం ఇవ్వలేదని వాదించారు. అంతేకాకుండా, రుణ చెల్లింపు ప్రణాళికలోనే ప్రతిపాదించిన రూ.6.5 కోట్ల మొత్తాన్ని ఖచ్చితమైనదిగా కాకుండా కేవలం సూచనాత్మక మొత్తంగా పేర్కొన్నారని రుణదాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రణాళిక తాత్కాలికంగా, ఆమోదానికి అనర్హంగా మారుతుందని వారు పేర్కొన్నారు. అయితే అభ్యంతరం వ్యక్తం చేసిన రుణదాతలందరూ కలిపి 20 శాతం కంటే తక్కువ ఓటింగ్ వాటాను మాత్రమే కలిగి ఉన్నారని ఎన్ సి ఎల్ టి పేర్కొంది. మరోవైపు, ఈ ప్రణాళికకు అవసరమైన మెజారిటీ లభించిందని, మొత్తం 80.81 శాతం ఓటింగ్ వాటా ఈ ప్రణాళికకు అనుకూలంగా ఉందని తెలిపింది. 144 పేజీల తన సుదీర్ఘ ఉత్తర్వుల్లో శర్మ వివిధ అంశాలను ప్రస్తావించారు . రిజల్యూషన్ ప్రొఫెషనల్ చేసిన మదింపు ప్రకారం సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ, ఈ ప్రణాళికలో ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే కూడా గణనీయంగా తక్కువగా ఉందని పేర్కొన్నారు.

ఈ ప్రణాళికను తిరస్కరిస్తే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన రుణదాతలు మరింత మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం కూడా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలా జరిగితే సుభాష్ చంద్ర ఆర్థిక పునరుద్ధరణ ద్వారా రుణాలు చెల్లించే పరిస్థితికి బదులుగా దివాలా ప్రక్రియను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వివరించారు. "ఈ ప్రణాళికకు ఆమోదం లభించి, రుణగ్రహీత దివాలా సమస్య పరిష్కరించబడి, తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి ఏర్పడితే, అభ్యంతరం వ్యక్తం చేసిన రుణదాతలు తమ బకాయిలను ప్రధాన రుణగ్రహీతల నుంచి నేరుగా తిరిగి పొందే అవకాశం చివరికి మెరుగవుతుంది" అని ఎన్ సి ఎల్ టి వ్యాఖ్యానించింది. రుణదాతల వ్యాపారపరమైన నిర్ణయానికి బదులుగా తన సొంత నిర్ణయాన్ని రుద్దడం ఎన్ సిఎల్ టి పని కాదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. సెటిల్‌మెంట్ మొత్తం సరిపోతుందా లేదా అనే విషయాన్ని కూడా తాను నిర్ణయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. రుణదాతల వాణిజ్యపరమైన నిర్ణయం చట్టబద్ధమైన వ్యవస్థ పరిధిలోనే అమలవుతుంది, దాని వెలుపల కాదు" అని పేర్కొంది. ఎన్ సిఎల్ టి రుణదాతల వాణిజ్యపరమైన నిర్ణయానికి బదులుగా తన సొంత నిర్ణయాన్ని తీసుకోదు. విశ్వసనీయ ఆధారాలు లేని ఆరోపణలపై విస్తృత స్థాయి విచారణ కూడా చేపట్టదు. చట్టం ప్రత్యేకంగా కోరిన సందర్భాలు మినహా, ఎన్ సిఎల్ టి పాత్ర పర్యవేక్షణ, సరిదిద్దడం, న్యాయపరమైన పరిశీలన వరకే ఉంటుంది, దర్యాప్తు చేయడం కాదు" అని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

ఈ ప్రణాళికకు ఒకసారి ఆమోదం లభించిన తర్వాత IBCలోని సెక్షన్ 115 ప్రకారం అది రుణదాతలందరికీ వర్తిస్తుందని NCLT పేర్కొంది. వారు ప్రణాళికకు అనుకూలంగా ఓటు వేసినా, వ్యతిరేకంగా ఓటు వేసినా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ప్రణాళికకు అంగీకరించిన రుణదాతలపై మాత్రమే దానిని అమలు చేసి, వ్యతిరేకించిన రుణదాతలు తమ పూర్తి అసలు రుణాన్ని విడిగా రికవరీ చేసుకునేలా చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. "సెక్షన్ 114 కింద రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం లభించిన తర్వాత, దాని బైండింగ్ ప్రభావం కోడ్‌లోని సెక్షన్ 115 ద్వారా నిర్ణయించబడుతుంది. ప్రణాళికకు అనుకూలంగా ఓటు వేసిన రుణదాతలపైనే దానిని అమలు చేసి, వ్యతిరేకించిన రుణదాతలకు తమ పూర్తి అసలు రుణాన్ని స్వతంత్రంగా రికవరీ చేసుకునే అవకాశం ఇవ్వడం ఎన్ సిఎల్ టి కి సాధ్యం కాదు" అని పేర్కొంది. సెక్షన్ 115 ఆమోదం పొందిన రుణ చెల్లింపు ప్రణాళికను కొంతమంది రుణదాతలకు మాత్రమే వర్తింపజేసే విధానాన్ని అనుమతించదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

అందువల్ల, ఆమోదించబడిన ప్రణాళికకు అంగీకరించిన రుణదాతలైనా, వ్యతిరేకించిన రుణదాతలైనా, దాని పరిధిలో ఉన్న అందరూ కట్టుబడి ఉండాలి. వ్యతిరేకించిన రుణదాతలకు ప్రణాళిక వెలుపల తమ పూర్తి రుణాన్ని రికవరీ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వడం చట్టబద్ధమైన వ్యవస్థ ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా, రుణదాతల మధ్య అసమానమైన వ్యవహారానికి దారితీస్తుంది" అని ఎన్ సిఎల్ టి తన ఆదేశాల్లో పేర్కొంది. రుణ చెల్లింపు ప్రణాళికను ఆమోదిస్తూ ఎన్ సిఎల్ టి పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత, పర్సనల్ గ్యారంటర్ సమర్పించిన ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్‌, 2016లోని సెక్షన్ 114 కింద ఆమోదించాల్సిన అవసరం ఉందని అని పేర్కొంది. ఆమోదించబడిన రీపేమెంట్ ప్లాన్‌కు అంగీకరించినా, వ్యతిరేకించినా, రుణదాతలు అందరూ IBCలోని సెక్షన్ 115 ప్రకారం కట్టుబడి ఉండాలి" అని ఎన్ సిఎల్ టి స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it