అక్టోబర్ 8 న ప్రారంభం

దేశీయ విమానయాన రంగంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధం అయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. అదే నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఎన్ఎంఐఏ). కొత్తగా అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 8 న జాతికి అంకితం చేయబోతున్నారు. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తన సేవలు కొనసాగించనుంది. అక్టోబర్ 8 న ప్రారంభోత్సవం తర్వాత ఈ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి క్రమక్రమంగా ఎయిర్ లైన్స్ తమ సర్వీసులను ప్రారంభించనున్నాయి. ఇక్కడ నుంచి సర్వీస్ లు స్టార్ట్ చేసేందుకు దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ అయిన ఇండిగో తో పాటు ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ లైన్స్ కూడా తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఇక్కడ నుంచి దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీస్ లు కూడా ప్రారంభం కానున్నాయి.
పీపీపీ విధానంలో అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అఫ్ మహారాష్ట్ర (సిడ్కో) లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేశాయి. వాస్తవానికి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ జీవీకే చేతిలో ఉన్న విషయం తెలిసిందే. యూపీఏ హయాంలో జీవీకే కి ఈ ప్రాజెక్ట్ దక్కగా...తర్వాత జరిగిన పలు పరిణామాల్లో జీవీకే పై 705 కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు సిబిఐ కేసు నమోదు చేయటం...తర్వాత జీవీకే ఈ ఎయిర్ పోర్ట్ లో 74 శాతం వాటాను అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ కు విక్రయించటం జరిగిపోయాయి. ఇది జరిగిన తర్వాత విచిత్రంగా సిబిఐ జీవీకే ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదు అని తేల్చింది. దగ్గర దగ్గర 2900 ఎకరాల్లో ఈ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నారు.
ఈ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముంబై కూడా రెండు విమానాశ్రయాలు ఉన్న అంతర్జాతీయ నగరాలు అయిన లండన్, న్యూ యార్క్, టోక్యో ల సరసన నిలవబోతోంది. సెప్టెంబర్ 30 నే నవీ ముంబై ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అత్యంత కీలకమైన ఏరోడ్రోమ్ లైసెన్స్ అందుకుంది. భద్రత ప్రమాణాలతో పాటు అన్ని నియంత్రణా ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే ఈ లైసెన్స్ జారీ చేస్తారు. తొలి దశలో ఈ ఎయిర్ పోర్ట్ ఒక టెర్మినల్..ఒక రన్ వే తో ఏడాదికి రెండు కోట్ల మంది (20 మిలియన్లు ) ప్రయాణికులు రాకపోకలు సాగించేలా అభివృద్ధి చేశారు. భవిష్యత్ లో ఇక్కడ నాలుగు టెర్మినల్స్, రెండు రన్ వే లు వస్తాయి. దీంతో రెండు ఎయిర్ పోర్ట్స్ అంటే నవీ ముంబై తో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ల వార్షిక సామర్ధ్యం 15 . 5 కోట్ల కు చేరుతుంది అని అంచనా. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కార్గో హబ్ గా అవతరించనుంది. కార్గో కోసం నవీ ముంబై ఎయిర్ పోర్ట్ లో పూర్తి ఆటోమేటిక్, ఏఐ ఆధారిత టెర్మినల్ ను సిద్ధం చేశారు.



