మహారాష్ట్రలో విషాదం..22 మంది మృతి
దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ప్రతి రోజూ మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తున్నా ఇది మాత్రం ఆగటం లేదు. ఓ వైపు కేసులతో సతమతం అవుతున్న తరుణంలో మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ ఆసుపత్రి వద్ద జరిగిన షాకింగ్ ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఏకంగా 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఆక్సిజన్ నింపుతుండగా ట్యాంక్ అకస్మాత్తుగా లీక్ కావడం ప్రారంభమైంది.
దీంతో ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో అక్కడ తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక దళ సిబ్బందిని తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.ఈ పరిణామంతో ఆక్సిజన్ సరఫరా 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. దీనిపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ జాకీర్ హుస్సేన్ స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.