Telugu Gateway
Top Stories

మరింత ముదరనున్న డోనాల్డ్ ట్రంప్- ఎలాన్ మస్క్ వివాదం!

మరింత ముదరనున్న డోనాల్డ్ ట్రంప్-  ఎలాన్ మస్క్ వివాదం!
X

అమెరికా రాజకీయం ఇక కొత్త మలుపు తిరగబోతోంది. ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ ముందు ప్రకటించినట్లుగానే కొత్త పార్టీ అనౌన్స్ చేశారు. ఆ పార్టీ పేరు ది అమెరికన్ పార్టీ అని వెల్లడించారు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే ఆ వెంటనే కొత్త పార్టీ పెడతాను అని చెప్పిన మస్క్ అన్నంత పని చేశారు. దీంతో ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్-ఎలాన్ మస్క్ ల మధ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా లో కొత్త పార్టీ ఆవశ్యకతపై కొద్ది నెలల క్రితం మస్క్ ఎక్స్ లో పోల్ పెట్టగా ఏకంగా 80 శాతం మంది దీనికి మద్దతుగా నిలిచారు. ఇటీవలే ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సంతకం చేయటంతో వివాదాస్పద బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టరూపం దాల్చింది. దీంతో ఎలాన్ మస్క్ చెప్పినట్లుగానే పార్టీ ప్రకటన చేశారు.

అయితే ఈ పార్టీ అమెరికా లో ఎంత మేర ప్రభావం చూపిస్తుంది అన్నది ఇప్పటికిప్పుడు తేలకపోయినా కూడా రాబోయే రోజుల్లో డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ల మధ్య వార్ నడిచే అవకాశం ఉంది అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరపున ఎలాన్ మస్క్ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో పాటు భారీ ఎత్తున ఎన్నికల నిధులు కూడా సమకూర్చిన విషయం తెలిసిందే. తర్వాత మస్క్ కు డిపార్ట్మెంట్ అఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారధ్య బాధ్యతలు అప్పగించారు. డోనాల్డ్ ట్రంప్-ఎలాన్ మస్క్ ల మధ్య ఈ కొత్త బిల్లే చిచ్చు పెట్టింది అని చెప్పాలి.

ఒక దశలో డోనాల్డ్ ట్రంప్ అయితే ఎలాన్ మస్క్ ను దక్షిణ ఆఫ్రికా కు వెనక్కి పంపిస్తాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీని తర్వాత ఎలాన్ మస్క్ కొద్దిగా సైలెంట్ అయినట్లు కనిపించినా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడంతో ఆయన ట్రంప్ తో తేల్చుకోవటనికే సిద్ధపడినట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా లో ఇప్పుడు ప్రజస్వామ్యం లేదు అని...దీన్ని ఇవ్వటానికే తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

మరో వైపు డోనాల్డ్ ట్రంప్ విధానాలపై అమెరికా ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. అమెరికా పౌరులు అయినప్పటికీ కొంత మందిని దేశం నుంచి బహిష్కరించాల్సి ఉంది అంటూ డోనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై కొంత మంది ఘాటుగా స్పందించారు. దీని ప్రకారం ముందు ట్రంప్ భార్య అయిన మెలానియా ట్రంప్ ను, ఆమె తల్లితండ్రులను కూడా అమెరికా నుంచి బహిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున ఆన్ లైన్ పిటిషన్ పై సంతకాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆమె యుగోస్లేవియాలో జన్మించారు. తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు.

Next Story
Share it