అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం!

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడు ఎలాన్ మస్క్ మధ్య మళ్ళీ విబేధాలు తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. దీన్ని ఆమోదింప చేసుకునే దిశగా ఆయన వేగంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే ఈ బిల్లు సెనెట్ ఆమోదం పొందింది. ఇదే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆగ్రహానికి కారణం అవుతోంది. కొద్దికాలం క్రితం ఇద్దరి మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మధ్యలో ఇవి సద్దుమణిగినట్లు కనిపించాయి. కానీ ఎలాన్ మస్క్ తాజాగా వరస ట్వీట్స్ తో ట్రంప్ సర్కారు పై విరుచుకుపడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి..ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటూ ఆయన మండిపడుతున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే కొత్త పార్టీ పెడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా అమెరికా కు కొత్త పార్టీ అవసరం ఉందా అంటూ ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోల్ పెడితే దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలోనే డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ల మధ్య విబేధాలు పెరిగాయి అని చెప్పొచ్చు. ఈ బిల్లు అమెరికా ను మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మస్క్. దీని వల్ల సామాజిక సంక్షేమ కార్యక్రమాలు కూడా తగ్గుతాయి అని చెపుతున్నారు. కాంగ్రెస్ కు చెందిన ప్రతి ఒక్క సభ్యుడు ప్రభుత్వ ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడు అందుకు బిన్నంగా వ్యవరిస్తున్నారు అని విమర్శించారు. ఈ బిల్లు రుణ పరిమితిని ఏకంగా ఐదు ట్రిలియన్ డాలర్లకు పెంచుతుంది అని తెలిపారు. అందుకే ఇప్పుడు ప్రజల గురించి శ్రద్ద తీసుకునే రాజకీయ పార్టీ అవసరం అని పేర్కొన్నారు. ఈ బిల్లు కు అనుకూలంగా ఓటు వేసినవాళ్లు తర్వాత సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ బిల్లులో సరిహద్దులు, దేశ భద్రతకు ఏకంగా 350 బిలియన్ డాలర్లు కేటాయించారు. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడను విస్తరించేందుకు 46 బిలియన్ డాలర్లు, వలసదారుల డిటెన్షన్ బెడ్స్ కోసం 45 బిలియన్ డాలర్లు, వలసల శాఖలో 10 వేల మంది సిబ్బంది నియామకం కోసం భారీగా నిధులను కేటాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బిల్లుకు మద్దతుగా ఉన్న సెనేటర్లకు మస్క్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. మరి ఈ బిల్లు అమలులోకి వస్తే ఎలాన్ మస్క్ చెప్పినట్లుగానే కొత్త పార్టీ పెట్టి డోనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది అని అందరూ అంచనావేస్తున్నారు.



