ముంబయ్ పోలీస్ కమిషనర్ పై బదిలీ వేటు
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి ముందు జిలెటిన్ స్టిక్స్ కలకలం వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయ దుమంర రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి వరస పెట్టి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి ముంబయ్ కు చెందిన పోలీసు అధికారి సచిన్ వాజేను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మహారాష్ట్ర సర్కారు ఆకస్మికంగా ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ పై బదిలీ వేటు వేసింది. ఇది మరింత కీలకంగా మారింది. ఆయన్ను హోం గార్డ్స్ విభాగానికి బదిలీ చేశారు, పరమ్ బీర్ సింగ్ స్థానే కొత్త కమిషనర్ గా హేమంత్ నగరాలేను నియమించింది. మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఈ వివరాలను వెల్లడించారు.
ముఖేష్ అంబానీ నివాసం వద్ద భద్రతా వైపల్యం వ్యవహారం గత కొన్ని రోజులుగా రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్ఐఏ కు ఈ కేసు అప్పగించటాన్ని అధికార శివసేన తప్పుపట్టింది.. అంతే కాదు..సచిన్ వాజే అరెస్ట్ పై కూడా ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై బిజెపి మాత్రం శివసేన సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖేష్ అంబానీ ఇంటి ముందు ఘటన జరగటానికి ముందు సచిన్ వాజే పీపీఈ కిట్ తోపాటు ఏమీ కన్పించకుండా కవర్ చేసుకుని అక్కడ తచ్చాడినట్లు విచారణలో తేలిందనే అంశం వెలుగులోకి రావటం మరింత దుమారం రేపుతోంది. ఈ తరుణంలో పరమ్ బీర్ సింగ్ బదిలీ మరింత దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది.