ముంబయ్ 'నారీమన్ పాయింట్ ' 80 శాతం నీళ్ళలోకే!
నారిమన్ పాయింట్. ముంబయ్ లో చాలా ఖరీదైన ప్రాంతం. అంతే కాదు..పర్యాటకపరంగా కూడా ఇది ఎంతో కీలకమైన ప్రదేశం. ముంబయ్ లోని ఆకాశ హర్మ్యాలకు ఇది కేరాఫ్ అడ్రస్. కీలకమైన ఆఫీసులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంతటి కీలకమైన నారీమన్ పాయింట్ కు సంబంధించి బృహన్ ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ ఐ ఎస్ చహల్ సంచలన విషయం వెల్లడించారు. వాతావరణ మార్పులు మన ఇంటి ముందుకే వచ్చాయని వ్యాఖ్యానించారు. 2050 నాటికి ముంబయ్ లోని నారీమన్ పాయింట్, మంత్రాలయానికి సంబంధించి 80 శాతం నీటిలోనే ఉంటుందని తెలిపారు. సముద్రం ముందుకు రావటం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నం కానుందని తెలిపారు. ప్రకృతి నుంచి ఈ మేరకు హెచ్చరికలు వస్తున్నాయన్నారు. మనం మేల్కొనకపోతే వచ్చే 25 సంవత్సరాల్లో చాలా ప్రమాదకర పరిస్థితులు చూడాల్సి ఉంటుందని తెలిపారు.
ముంబయ్ వాతావరణ కార్యాచరణ ప్రణాళిక వెబ్ సైట్ ప్రారంభిస్తూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్ తరాలే కాకుండా..ప్రస్తుత జనరేషన్స్ కూడా నష్టపోవాల్సి ఉంటుందని తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో మెకన్సీ ఇండియా ఇచ్చిన నివేదికలో ఆకస్మాత్తుగా వచ్చే వరదలు..సముద్రం ముందుకొచ్చే అంశాలను కూడా ప్రస్తావించందని తెలిపారు. అదే సమయంలో ముంబయ్ లో అసాధారణ రీతిలో భారీ వర్షాలు కురవటం కూడా పెరుగుతుందన్నారు. గత 15 నెలల కాలంలోనే మూడుసార్లు తుఫాన్లు వచ్చాయని..2020 ఆగస్టు 5న సౌత్ ముంబయ్ లో చాలా ప్రాంతాలు 5 అడుగుల మేర నీటమునిగాయన్నారు. కానీ ఆ రోజు అసలు తుఫాన్ హెచ్చరికే లేదన్నారు.కానీ పరిస్థితి మాత్రం తుఫాన్ గా మారిందన్నారు. ముంబయ్ నగరంలో అసాధారణగా వర్షాలు కురుస్తున్నాయని..జులై నెలలో రావాల్సిన సగటు వర్షపాతంలో 70 శాతం కేవలం నాలుగు రోజుల్లోనే నమోదు అయిందన్నారు.