ముంబయ్-ఖాట్మండు విమాన సర్వీసుల పునరుద్ధరణ
సుదీర్ఘ విరామం ముగిసింది.అంతర్జాతీయ రూట్లలోనూ విమానాలు ఈ రాత్రి నుంచే గాల్లోకి ఎగరనున్నాయి. ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు ఉన్నా అవి పరిమితంగానే ఉన్నాయి. . దీంతో టిక్కెట్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు కరోనాకు ముందు తరహాలో సర్వీసులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అయింది. అయితే పూర్తి స్థాయిలో అంటే కరోనాకు ముందు ఉన్న తరహాలో సర్వీసులు నడవాలంటే ప్రయాణికుల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరగాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ప్రారంభించేందుకు రెడీ అయ్యాయి. ప్రయాణికుల సంఖ్య ఎంత వేగంగా పెరిగితే అంత వేగంగా సర్వీసుల సంఖ్య కూడా సాధారణ స్థితికి రానుంది. దేశీయ ఎయిర్ లైన్సే కాకుండా విదేశీ ఎయిర్ లైన్స్ కూడా తమ సర్వీసులు ప్రారంభించటానికి రెడీ అయ్యాయి. అందులో భాగంగానే నేపాల్ ఎయిర్ లైన్స్ ఎంతో పాపులర్ అయిన ముంబయ్-ఖాట్మండు సర్వీసులకు శ్రీకారం చుట్టింది.
ఇది ఆ ఎయిర్ లైన్స్ కు ఎంతో పాపులర్ రూట్. కరోనా ముందు ఈ రూట్ లో పర్యాటకులు భారీ ఎత్తున రాకపోకలు సాగించేవారు. సుదీర్ఘ విరామం అనంతరం నేపాల్ ఎయిర్ లైన్స్ కార్పొరేషన్ తిరిగి ముంబయ్-ఖాట్మండు విమాన సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి ముహుర్తం మార్చి 27గా నిర్ణయించారు. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసులను ఆపరేట్ చేయనున్నారు. ఇవి ఆదివారం, బుధవారం, శుక్రవారాలు ఉంటాయని నేపాల్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఈ సందర్భంగా పలు ఆకర్షణీయ ఆఫర్లతో కూడా ఎయిర్ లైన్స్ ముందుకొచ్చింది. కీలకమైన ఈ రూట్ లో అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు. తమ సర్వీసు పూర్తి స్థాయిలో ఆపరేట్ చేసే స్థితికి చేరుకుంటుందని నేపాల్ ఎయిర్ లైన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నేపాల్ లో సుందర దృశ్యాలతోపాటు ఎన్నో చారిత్రక ప్రాంతాలు ఉండటంతో పర్యాటకులు భారీ ఎత్తున దేశాన్ని సందర్శిస్తుంటారు.