Telugu Gateway
Top Stories

జూన్ 19 న రిలయన్స్ ఏజీఎం

జూన్ 19 న రిలయన్స్ ఏజీఎం
X

దేశంలోనే అతి పెద్ద ఐపీఓ ఈ ఏడాది మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అదే రిలయన్స్ జియో ఐపీవో. తోలి పబ్లిక్ ఆఫర్ ద్వారా కంపెనీ ఏకంగా 50000 వేల కోట్ల రూపాయల వరకు సమీకరించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు పూర్తి కావాల్సి ఉన్నా కూడా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇందులో జాప్యం జరిగింది. ప్రతి ఏటా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) తేదీ వచ్చింది. జూన్ 19 న ఏజీఎం నిర్వహించనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ ఏజీఎంలో రిలయన్స్ జియో ఐపీవో పై స్పష్టత రావటంతో పాటు కంపెనీ నుంచి పలు ప్రకటనలు ఉండే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లు చేసిన దాడి కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు స్టాక్ మార్కెట్ లో

కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ట స్థాయి 1611 రూపాయలు అయితే...ప్రస్తుతం ఇది 1350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బుధవారం నాడు కూడా ఈ షేర్ ధర బిఎస్ఈ లో ఏడు రూపాయల నష్టంతో ముగిసింది. జూన్ 19 న జరగనున్న ఏజీఎంలో రిలయన్స్ రిటైల్ వ్యాపార విస్తరణతో పాటు పలు కీలక ప్రాజెక్ట్ ల పెట్టుబడులపై రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే సమయంలో కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ఒక్కో షేర్ కు ఆరు రూపాయల డివిడెండ్ చెల్లింపులకు ఏజీఎం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జియో ఐపీవో పై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన ఉంటుందా అన్న ఆసక్తి ఇన్వెస్టర్లలో ఉంది. ఇది పూర్తి అయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిటైల్ వ్యాపారానికి సంబంధించి కూడా ఐపీవో కు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు ఉంటుంది అన్నది జియో ఐపీవో తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు.

Next Story
Share it