Telugu Gateway
Top Stories

మార్కెట్ లో భారీ ఐపీఓల సందడి

మార్కెట్ లో భారీ ఐపీఓల సందడి
X

దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే రెండు అతి పెద్ద ఐపీవోలకు రంగం సిద్ధం అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) స్టాక్ మార్కెట్ నుంచి దగ్గర దగ్గర 30000 కోట్ల రూపాయలు సమీకరించనుంది. ఇప్పటికే సెబి దగ్గర ఈ ఐపీవో పేపర్స్ దాఖలు చేసింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలోనే ఈ షేర్లు జారీ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు రిలయన్స్ జియో ఐపీవో విషయంలో కూడా ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అటు రిలయన్స్ ఇన్వెస్టర్లతో పాటు ఇతర మదుపర్లు కూడా జియో ప్లాట్ ఫార్మ్స్ ఇష్యూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో ఐపీవో కు సంబంధించిన ముసాయిదా పత్రాలను కంపెనీ బోర్డు ఇప్పటికే ఆమోదించింది అని..వీటిని సెబీకి శుక్రవారం నాడే సమర్పించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంలో సంస్థ సీఎండీ ముఖేష్ అంబానీ వెల్లడించారు. మరో వైపు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో కూడా కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఐపీవో లో భాగంగా కంపెనీ ఒక్కో షేరు ను పది రూపాయల ముఖ విలువ తో మొత్తం 27 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది అని తెలిపారు.

షేర్ల ఇష్యూ ధరను బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్ణయిస్తారు అని తెలిపారు. వాస్తవానికి 2026 సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలోనే జియో ఐపీవో ను పూర్తి చేయాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇదే విషయాన్ని ముఖేష్ అంబానీ గతంలో అధికారికంగా ప్రకటించారు కూడా. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ లు చేసిన యుద్ధంతో కొన్ని నెలలపాటు మార్కెట్ లు సంక్షోభంలో చిక్కుకోవడంతో జియో ఐపీవో వాయిదాపడింది. జియో ఐపీవో ద్వారా మార్కెట్ నుంచి దగ్గర దగ్గర 38000 కోట్ల రూపాయలు సంకీరించే అవకాశం ఉంది. దీంతో ఎన్ఎస్ఈ ఇష్యూ కంటే ఇదే పెద్ద ఐపీవో కానుంది. అదే సమయంలో ఇవి మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దేశంలో అతి పెద్ద ఐపీవోల్లో ఫస్ట్ ప్లేస్ లో రిలయన్స్ జియో...ఆ తర్వాత ఎన్ఎస్ఈ ఐపీవో నిలవబోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో హ్యుండయ్ మోటార్ ఇండియా, రెండవ ప్లేస్ లో ఎల్ఐసి ఐపీవో లు ఉన్నాయి. జియో ఐపీవో రిలయన్స్ వాటాదారులకు గణనీయమైన విలువను అందించటంతో పాటు కొత్త పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది అని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రపంచ స్థాయి సామర్ధ్యం కల సంస్థలను భారత్ నిర్మించగలదు అని జియో లిస్టింగ్ నిరూపిస్తుంది అంటూ ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it