Telugu Gateway
Top Stories

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో కొత్త రికార్డు

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో కొత్త రికార్డు
X

భారతీయ స్టాక్ మార్కెట్ లో పేటిఎం, ఎల్ ఐసి వంటి షేర్లు ఆఫర్ ధరకు చేరుకోవటానికి మల్లగుల్లాలు పడుతున్నాయి.. ఈ తరుణంలో మంగళవారం నాడు పెద్ద సంచలనం చోటు చేసుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీ షేర్ ఏకంగా లక్ష రూపాయలకు చేరి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా ఈ రికార్డు ను నమోదు చేయలేదు. దిగ్గజ టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ ఈ అరుదైన ఘనతను సాధించింది. మంగళవారం నాడు ఎంఆర్ఎఫ్ షేర్ ధర తొలిసారి లక్ష రూపాయలకు చేరుకుంది. ఈ కంపెనీకి చెందిన ఒక్క షేర్ లక్ష రూపాయలు అంటే...ఎవరి దగ్గరైన వంద షేర్లు ఉంటే కోటి రూపాయలు ఉన్నట్లు లెక్కే. 2012 సంవత్సరంలో ఈ షేర్ తొలిసారి పది వేల రూపాయల మార్క్ ను టచ్ చేసింది. 2021 జనవరి లో అలాగే తొంబై వేల రూపాయల ధరకు చేరుకుంది. రెండున్నర సంవత్సరాల వ్యవధిలో ఇప్పుడు 2023 జూన్ 13 న లక్ష రూపాయల ధరను తాకి సంచలనం సృష్టించింది.

మంగళవారం నాడు 100300 రూపాయల గరిష్ట స్థాయికి చేరిన ఎంఆర్ఎఫ్ షేర్ ధర మొత్తం మీద 1011 రూపాయల లాభంతో 99950 రూపాయల వద్ద ముగిసింది. ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజషన్ 42390 కోట్ల రూపాయలుగా ఉంది. కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండటంతో స్టాక్ కూడా దూసుకెళుతోంది. అయితే కంపెనీ షేర్ రికార్డు ధరకు చేరుకున్నా ఈ స్క్రిప్ లో వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మంగళవారం నాడు బిఎస్ఈలో మొత్తం ట్రేడ్ అయిన షేర్లు కేవలం 506 మాత్రమే కావటం గమనార్హం. ఎల్ఐ సి 949 రూపాయల ధరతో మార్కెట్ లోకి రాగా ఇప్పుడు ఆ షేర్ ధర ఆఫర్ ప్రైస్ కంటే దిగువన 598 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. పేటిఎం పరిస్థితి కూడా అంతే. ఈ కంపెనీ 2150 రూపాయల ధరతో షేర్లు జారీ చేసింది. ఇప్పుడు అవి ఒక్కోటి 833 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

Next Story
Share it