కరోనా కాలంలోనూ మిలియన్ల మంది మిలియనీర్ల జాబితాలోకి
గత ఏడాది కరోనా దెబ్బకు పేదలు మరింత పేదలు అయ్యారు. మధ్య తరగతి చితికిపోయారు. కానీ విచిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 50 లక్షల మందికిపైగా మిలియనీర్లు అయ్యారు. అంతటా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి, జీడీపీలు భారీగా పతనం అయిన సమయంలో ఈ మార్పు జరగటం కీలకంగా మారింది. గత ఏడాది కొత్తగా 52 లక్షల మంది మిలియనర్లు కావటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ జాబితా 56.1 మిలియన్లకు చేరిందని క్రెడిట్ సూసీ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2020లో ఒక శాతంపైగా పెద్దలు తొలిసారి మిలియనీర్ల జాబితాలోకి ప్రవేశించారు. విచిత్రం ఏమిటంటే స్టాక్ మార్కెట్ల దూకుడు, పలు చోట్ల అమాంతం పెరిగిన ఇళ్ళ ధరలు దీనికి కారణంగా పేర్కొంది. సంపద పెరుగుదల, ఆర్ధిక పరిస్థితులకు సంబంధం లేకుండా పోయిందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తక్కువ వడ్డీ రేట్లు, ప్రభుత్వం పలు కార్యక్రమాలకు మద్దతు ఇవ్వటంతో సంపద ప్రభుత్వ రంగం నుంచి వ్యక్తులకు చేరినట్లు అయిందని తెలిపారు.
పెట్టుబడులు పెట్టే స్థాయిలో ఉండే అధిక నికర విలువ (నెట్ వర్త్ ) ఉండే వారు అంటే 30 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్న వారి సంఖ్య ఒక్క 2020లోనే 24 శాతం మేర పెరిగింది. 2003 తర్వాత ఇంత వేగంగా పెరగటం ఇదే మొదటిసారి కావటం విశేషం. పెట్టుబడి పెట్టేవారి సంఖ్యతోపాటు సాధారణ మిలియనీర్లను కూడా పరిగణనలోకి తీసుకున్నందున ఇతర నివేదికలతో పోలిస్తే ఇక్కడ సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గత ఏడాది భారీగా లాభపడిన దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా..ఆ తర్వాత ఆస్ట్రేలియా, స్వీడన్, బెల్జియం, నెదర్లాండ్స్, అమెరికా, జర్మనీ, డెన్మార్క్, కెనడా తదితర దేశాలు ఉన్నాయని బీబీసీ న్యూస్ తన కథనంలో పేర్కొంది.