రైతుల కంటే వ్యాపారవేత్తల ఆత్మహత్యలే ఎక్కువ

రైతుల కంటే వ్యాపారవేత్తల ఆత్మహత్యలే ఎక్కువ అనే గణాంకాలు ఆశ్చర్యం కలిగించేవే. సహజంగా వ్యవసాయం చేసి అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు తరచూ అందరూ చూస్తూనే ఉంటారు. దేశంతో పాటు..రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ తమవి రైతు ప్రభుత్వాలే అని చెప్పుకుంటాయి...కానీ వారి కష్టాలు మాత్రం తీరవు..ఆత్మహత్యలు ఆగవు. దేశంలో వరసగా రెండవ ఏడాది కూడా రైతుల కంటే వ్యాపారవేత్తల ఆత్మహత్యలే ఎక్కువగా ఉన్నాయి. 2021లో దేశ వ్యాప్తంగా 12,055 మంది వ్యాపారవేత్తలు ఆత్మహత్యలు చేసుకుంటే..అదే సమయంలో రైతు ఆత్మహత్యలు 10,881గా ఉన్నాయి. ఇవి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బి) అధికారిక లెక్కలే. 2020లో ఆత్మహత్యలు చేసుకున్న వ్యాపారవేత్తలు 11,716 మంది ఉంటే..ఇదే సమయంలో రైతుల ఆత్మహత్యలు 10667గా ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకునే వారి పనికి..ఆత్మహత్యలకు సంబంధం లేదు. కానీ అధికారిక డేటాలో మాత్రం వారు చేస్తున్న పనిని ప్రస్తావిస్తారు. వ్యాపారవేత్తల ఆత్మహత్యల్లో కర్ణాటక 14.2 శాతంతో మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర 13.2 శాతం, మధ్యప్రదేశ్ 11.3 శాతం, తమిళనాడు 9.4 శాతం, తెలంగాణలో 7.5 శాతం ఆత్మహత్యలు నమోదు అవుతున్నాయి. రైతులు అయినా..వ్యాపారవేత్తలు అయినా ఆత్మహత్యల దిశగా సాగకుండా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.



