'మూన్ దుబాయ్ రిసార్ట్'.. మరో అద్భుతం

అద్భుతాలు చేయటంలో దుబాయ్ అందరి కంటే ముందు ఉంటుంది. ముఖ్యంగా పర్యాటకులను ఆకట్టుకునే విషయంలో. కొన్ని దుబాయ్ సొంతంగా చేస్తే మరికొంత మంది పారిశ్రామికవేత్తలు ఎక్కడ తమ ప్రాజెక్టులు పెడితే సక్సెస్ అవుతాయో లెక్కలేసుకుని నిర్ణయాలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే ఓ అద్బుత ప్రాజెక్టు దుబాయ్ లో రానుంది. అదే 'మూన్ దుబాయ్ రిసార్ట్'. ఒక్క మాటలో చెప్పాలంటే ఉపరితలం మీద 'చంద్ర మండలం' సృష్టించటం లాంటిదే. భవిష్యత్ తరాలు ఎలాంటి వాటిని ఇష్టపడతాయో వాటిని ఊహించి డిజైన్ చేయటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. కానీ దుబాయ్ ఈ విషయంలో చాలా ముందు ఉంటుంది. కెనడాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ కంపెనీ మూన్ వరల్డ్ రిసార్ట్స్ (ఎండబ్ల్యూఆర్) ఈ 'మూన్ దుబాయ్ రిసార్ట్' ప్రాజెక్టు రూపకల్పన చేసింది.
దీనికి సుమారు 40 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. 224 మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఇది అతి పెద్ద..వినూత్నమైన భవనంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా 4000 లగ్జరీ సూట్ లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాంతాన్ని లూనార్ కాలనీగా పిలుస్తారు. ఈ రిసార్ట్ లోనే పర్యాటకులు అంతరిక్ష పర్యాటకం అనుభవాలను ఆస్వాదించవచ్చు. స్పేస్ టూరిజం కోసం అమెరికాలో కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. కాకపోతే ఇది మరీ ఖరీదైన వ్యవహారం. ఈ మూన్ దుబాయ్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కొంత తక్కువ ఖర్చుతో ఈ స్పేస్ టూరిజం అనుభూతి పొందవచ్చు. ఈ మూన్ దుబాయ్ ప్రాజెక్టులో స్కై విల్లాస్ పేరుతో అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ నివాస సముదాయాలను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ మూన్ దుబాయ్ రిసార్ట్ లో నైట్ క్లబ్, సమావేశ మందిరాలు..మూన్ షటిల్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇందులో రాబోతున్నాయి. సోలార్ సెల్స్ తో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ఈ ప్రాజెక్టులో. పనులు ప్రారంభించిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తవటానికి నాలుగు సంవత్సరాలు పడుతుందని అంచనా.