Telugu Gateway
Top Stories

ఇండిగో బ్రాండ్ కు భారీ డ్యామేజ్

ఇండిగో బ్రాండ్ కు భారీ డ్యామేజ్
X

దేశంలో ఇప్పటి వరకు నెంబర్ వన్ గా ఇండిగో ఎయిర్ లైన్స్ఇ మేజ్ కు తాజా పరిణామాలతో భారీ డ్యామేజ్ జరిగింది. దేశంలోనే లాభాల్లో ఉన్న ఏకైక ఎయిర్ లైన్స్ కంపెనీ కూడా ఇదే. ఇండిగో కారణంగా దేశం గతంలో ఎన్నడూ చూడని విమానయాన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఇప్పుడు. ఇది సర్దుకోవటానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనే అంశంపై కూడా స్పష్టత రావటం లేదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినా కూడా ఇంకా ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దు అవుతూనే ఉన్నాయి. డిసెంబర్ 10 నాటికీ స్టెబిలైజ్ సాధిస్తామని కంపెనీ చెపుతున్నా కూడా వాతావరణం ఆ దిశగా ఉన్నట్లు కనిపించటం లేదు అనే చర్చ సాగుతోంది. గత కొన్ని రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు రోజుకు వందల సంఖ్యలో రద్దు కావటం..రీఫండ్స్ తదితర కారణాలతో సోమవారం నాడు ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు బిఎస్ఈ లో ఏకంగా 445 రూపాయలు నష్టపోయి 4926 రూపాయల వద్ద ముగిసాయి.

ఒక దశలో ఇవి 4842 రూపాయల కనిష్ట స్థాయిని తాకాయి. గత కొన్ని నెలలుగా వరసగా పెరుగుతూ వచ్చిన ఇండిగో షేర్లు గత కొన్ని రోజులుగా పతనం అవుతూ వస్తున్నాయి. సోమవారం నాడు భారీ నష్టాలను చవిచూశాయి. తాజాగా ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇండిగో పరిస్థితి పై స్పందించింది. సరైన ప్రణాళిక లేకపోవటమే ఈ స్థితికి కారణం అని...దీని వల్ల కంపెనీ అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది అని అంచనా వేసింది. నూతన విమానయాన నిబంధనలపై కంపెనీ సరైన విధంగా వ్యవరించలేకపోయింది అని పేర్కొంది. అదే సమయంలో మూడీస్ కంపెనీ కి చెందిన మానవ వనరుల స్కోర్ తో పాటు పాలనా స్కోర్ లో కూడా కోతలు వేసింది. ఇది రాబోయే రోజుల్లో కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని పేర్కొంది. మూడీస్ కామెంట్స్ కారణంగా మంగళవారం నాడు కూడా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు మరింత తగ్గే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it