ఇరకాటంలో మోడీ సర్కారు

ఎవరైనా సరే టీవీ...కారో కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనకు నచ్చిన షాప్...షో రూమ్ లో కొనుక్కుంటాం. తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పించుకుని కొంత డిస్కౌంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఇది ఎక్కడైనా జరిగిదే. కానీ భారత్ లాంటి దేశాన్ని మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనటానికి లేదు...కొంటే మేము చెప్పిన వాళ్ళ దగ్గరే కొనాలి అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించటం...దీనికి భారత ప్రభుత్వం సరే అన్న చందంగా వ్యవహరించటం చూసి దేశ ప్రజలు అవాక్కు అవుతున్నారు. ఇండియా ఆయిల్ ఎక్కడ నుంచి కొనాలి అన్నది డిసైడ్ చేసేది భారత ప్రధాని కాదు ...అమెరికా అంటూ లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బలంగా ప్రజల్లోకి వెళ్లాయి. అందుకే రాహుల్ గాంధీ భారత ప్రభుత్వం..అమెరికా తో చేసుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం ట్రేడ్ డీల్ కాదు....ట్రాప్ డీల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా లో అదానిపై నమోదు అయిన కేసు...ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల అయినప్పటి నుంచి ప్రధాని మోడీ కళ్ళలో భయం కనిపిస్తోంది రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత మాతను ప్రధాని మోడీ అమ్మేశారు...అమెరికా కు పూర్తి సరెండర్ అయ్యారు అంటూ విమర్శలు గుప్పించారు.
రైతుల విషయంలో కూడా మోడీ సర్కారు రాజీ పడింది అన్నారు. భారత్ కొద్ది రోజుల క్రితం వరకు రష్యా నుంచి చౌక ధరకు పెద్ద ఎత్తున ఆయిల్ దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా ఇదే విషయంలో పదే పదే ఒత్తిడి చేయటం...సుంకాలు పెంచటం వంటి చర్యలకు దిగటంతో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ళకు బ్రేక్ లు వేసింది. వాణిజ్య ఒప్పందం సమయంలో కూడా డోనాల్డ్ ట్రంప్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనకుండా ఒక కన్నేసి ఉంచాలని ఆ దేశ అధికారులను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే భారత్ కు చెందిన ఇద్దరు కీలక మంత్రులు పీయూష్ గోయల్, జై శంకర్ లు ఈ విషయం తమకు తెలియదు అంటే తమకు తెలియదు అని తప్పించుకోవటంతో ఇండియా అమెరికా ఒత్తిడికి తలొగ్గింది అనే విషయం స్పష్టం అవుతోంది. ఇండియా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు పఠిస్తున్న జపం ఏఐ. డేటా లేకపోతే ఏఐ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని ...కానీ భారత ప్రభుత్వం విదేశీ కంపెనీలకు మేలు చేసేలా డేటా సెంటర్ పరిశ్రమకు 20 సంవత్సరాల టాక్స్ రాయితీ ఇచ్చింది అని రాహుల్ గాంధీ విమర్శించారు.
డేటా లోకలైజషన్ రూల్స్ కు తిలోదకాలు ఇచ్చి అమెరికా కు అనుకూలంగా విధానంలో మార్పులు చేశారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దూకుడు చూపిస్తున్నారు. గతంలో తన చర్యలతో పలు మార్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఈ సారి లోక్ సభలో వ్యవహరిస్తున్న తీరు కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా లోక్ సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ని టార్గెట్ గా చేసుకుని అయన చేస్తున్న విమర్శలు ప్రజలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి అనే చర్చ సాగుతోంది. లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో అధికార ఎన్డీయే ఈ సారి పలు కీలక విషయాల్లో ఇరకాటంలో పడింది అనే చెప్పాలి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం విషయంలో లోక్ సభ లో ప్రధాని మోడీ సమాధానం లేకుండానే ముగించేశారు. ప్రతిపక్ష మహిళా సభ్యుల ముసుగులో ప్రధాని పై దాడి జరిగే అవకాశం ఉంది అని తనకు సమాచారం రావటంతో తానే ప్రధాని ని సభకు రావద్దు అని చెప్పినట్లు స్వయంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రధాని సమాధానం లేకుండా లోక్ సభలో రాష్ట్ర పతి కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగించిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. మరో వైపు అమెరికా తో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల ఇండియా కంటే అమెరికా కే ఎక్కువ లాభం కలుగుతుంది అనే విషయాన్ని రాహుల్ గాంధీ బలంగా వినిపించారు. గురువారం నాడు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయటంతో పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి రాహుల్ గాంధీ బీజేపీ నేతలకు పలు అంశాల్లో సవాళ్లు విసురుతున్నట్లు ఉంది అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.



