Telugu Gateway
Top Stories

మోడీ బర్త్ డే కి ట్రంప్ రిటర్న్ గిఫ్ట్

మోడీ బర్త్ డే కి ట్రంప్ రిటర్న్ గిఫ్ట్
X

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్ లో ప్రకంపనలు రేపుతోంది. హెచ్ 1 బీ వీసా ఫీజు ను లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవటంతో పాటు ..విదేశాల్లో ఉన్న వాళ్ళ విషయంలో దీన్ని 24 గంటల్లోనే అమలు చేస్తున్నట్లు ప్రకటించటం పెద్ద దుమారమే రేపుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఈ విషయాన్ని ప్రస్తావించకుండా విదేశాలపై ఆధారపడటమే దేశానికి ప్రథమ శత్రువు అని పేర్కొన్నారు. 140 కోట్ల కు పైగా జనాభా ఉన్న దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని...విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే ఆ దేశం అభివృద్ధిలో విఫలం అవుతుంది అని చెప్పుకొచ్చారు. శనివారం నాడు గుజరాత్ లో పర్యటించిన మోడీ ఒక సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉంటే తాజా పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఘాటుగా స్పందించారు. భారత్ కు బలహీన ప్రధాని ఉన్నారు అని ట్వీట్ చేశారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పాను అని..ఇప్పుడు మరో సారి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విదేశాల్లో భారత ప్రయోజనాలకు కాపాడటంలో ప్రధాని మోడీ విఫలం అవుతున్నారు అని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కూడా ప్రధాని మోడీ పై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీకి ఆయన ఫ్రెండ్ డోనాల్డ్ ట్రంప్ మంచి రిటర్న్ గిఫ్ట్ పంపారు అని ఎద్దేవా చేశారు. ఈ గిఫ్ట్ భారతీయనులను ఎంతో బాధిస్తుంది అన్నారు. రాహుల్ అభిప్రాయాన్నే కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యక్తం చేశారు. ట్రంప్ కుట్రలపై రాహుల్ 2017లోనే హెచ్చరించారని, ఇవాళ యావద్దేశం ప్రధాని మోదీని ప్రశ్నిస్తోందని అన్నారు. 'ఇదేమీ కొత్త పరిణామం కాదు. 2017 జూలై 5న ఇలాంటి కుట్ర జరుగుతోందని మోదీని రాహుల్ హెచ్చరించారు. ఏదైనా చేయాలని సూచించారు. కానీ మోదీ బలహీన ప్రధాని. అప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా అంతే. దీని ఫలితం ఈరోజు చూడబోతున్నాం. లక్షలాది మంది దేశ యువత నష్టపోనున్నారు. ట్రంప్ ప్రతిరోజూ అవమానిస్తూనే ఉన్నారు. కానీ మోదీ సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ట్రంప్ లయర్ అని పార్లమెంటులో చెప్పాలని మోదీకి రాహుల్‌ ఒక అవకాశం ఇచ్చారు. ఆయన ఆ మాట చెప్పి ఉంటే యావద్దేశం ఆయన వెనుకే ఉండేది. ఇవాళ యావద్దేశం మోదీని ప్రశ్నిస్తోంది' అని పవన్ ఖేరా అన్నారు.

ఇది అంతా చూస్తుంటే భారతదేశంపై ఒక పద్ధతి ప్రకారం అమెరికా పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది అని మరో కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. హెచ్-1బి వీసాపై ఇప్పుడు జరుగుతున్నది యాదృచ్ఛికం కాదని అన్నారు. వరుస పరిణామాలను గమనిస్తే.. పాకిస్థాన్ ప్రేరేపణతోనే యూఎస్ ముందుగానే కాల్పుల విరమణ ప్రకటన చేసిందని అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారని, ఆ తర్వాత భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారని పేర్కొన్నారు. యూఎస్ ఆశీర్వాదం లేకుండా సౌదీ-పాకిస్థాన్ రక్షణ భాగస్వామ్యం కుదిరే అవకాశం ఎంతమాత్రం లేదని తివారీ అన్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయన్నది కీలకంగా మారింది.

Next Story
Share it