Telugu Gateway
Top Stories

మోడీ సర్కారుది అప్పుడో మాట...ఇప్పుడో మాట!

మోడీ సర్కారుది అప్పుడో మాట...ఇప్పుడో మాట!
X

ప్రధాని మోడీ, బీజేపీ ఏది చెపితే అది అందరూ ఓకే అనేయాల్సిందేనా?. ఎవరికీ సొంత ఆలోచనలు...భిన్నమైన అభిప్రాయాలు ఉండకూడదా?. గత కొన్ని రోజులుగా మోడీ సర్కారుకు చెందిన కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలు ...సోషల్ మీడియా లో మోడీ భక్తులు చేస్తున్న హడావుడి చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. ఎందుకంటే గత కొన్ని రోజులగా దేశం అంతటా ఒకటే చర్చ. ఇండియా పేరును భారత్ గా మార్చాలి అని. భారత్ మాత్రమే సరైన పేరు అంటూ ఆకస్మాత్తుగా ఎందుకు తెరపైకి ఈ అంశాన్ని తెచ్చారు. జీ 20 సమావేశాల సందర్భంగా విదేశీ అతిథులకు రాష్ట్ర పతి ఇచ్చే విందు కోసం పంపిన ఆహ్వానాల్లో ఎప్పుడూ ప్రస్తావించేలా ప్రెసిడెంట్ అఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ అఫ్ భారత్ గా ముద్రించారు. దీంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఇండియా ప్లేస్ లో భారత్ ప్రత్యక్షం అయింది. నిజంగా ఇండియా పేరును భారత్ గా మార్చాలన్నా కూడా పెద్దగా ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ జీ 20 ఇన్విటేషన్స్ సమయంలోనే ఇది తెరపైకి వచ్చింది. అక్కడ నుంచే రకరకాల చర్చలు తెరపైకి వచ్చాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రస్తుతం ఉన్న ఇండియా పేరు ను భారత్ గా మార్చాల్సిన అవసరం లేదు అంటూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే ఇండియా పేరు మార్పును చాలా స్పష్టంగా వ్యతిరేకించింది. ఇండియా పేరును భారత్ గా మార్చాలంటూ ఒక వ్యక్తి సుప్రీం కోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాజ్యాంగానికి తుది రూపు ఇచ్చే సమయంలో రాజ్యాంగ సభ ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది అని...ఆర్టికల్ వన్ లో అందరి ఏకాభిప్రాయంతోనే ఇండియా అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది అని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతే కాదు..రాజ్యాంగ సభ ఈ అంశంపై సమగ్రంగా చర్చించినందున ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులే ఏమి లేవన్నారు.

అంటే ఆ పిల్ పై స్పందించిన మోడీ సర్కారు ఇండియా పేరు ను భారత్ గా మార్చాల్సిన అవసరం లేదు అంటూ ఎంతో స్పష్టంగా తెలిపింది. ఈ పిల్ ను విచారించిన సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్, జస్టిస్ యు యు లలిత్ లతో కూడిన బెంచ్ ఈ పిల్ ను తోసిపుచ్చుతూ ఎవరికీ ఇండియాగా కావాలంటే వాళ్ళు ఇండియా గా, భారత్ అని పిలవాలి అనుకుంటే భారత్ అని పిలుచుకోవచ్చు అంటూ 2016 లో తీర్పు వెలువరించింది. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే సుప్రీం తీర్పు కంటే కేంద్ర హోం శాఖ పిల్ కు ఇచ్చిన స్పందనే అత్యంత సంచలనంగా మారింది అనే చెప్పొచ్చు. అంటే అప్పుడు భారత్ పేరు అవసరం లేదు..ఇండియా గా కొనసాగటం వల్ల ఇబ్బంది లేదు అంటూ చెప్పిన సర్కారు ఇప్పుడు మాత్రం ఇండియా పేరు అంటే ఏ మాత్రం గిట్టనట్లు వ్యవరిస్తోంది. ప్రతిపక్షాల కూటమి ఎప్పుడు అయితే తమ కూటమి పేరును ఇండియన్ నేషన్ డెవలప్ మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా)గా మార్చిందో అప్పటినుంచే మోడీ కి ఇది మాత్రం గిట్టని వ్యవహారంగా మారింది. అందుకే అయన మనసులో తన కసిని కూడా ఆపుకోలేక ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులో కూడా ఇండియా ఉంది అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఈ పరిణామాలు అన్ని గమనిస్తే మోడీ కి భారత్ పేరుపై ప్రేమ అకస్మాత్తుగా పుట్టడం వెనక రాజకీయ కారణాలు తప్ప మరొకటి కాదు అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే 2016 లో ఇండియా పేరును భారత్ గా మార్చటానికి ఏ మాత్రం ఇష్టపడని మోడీ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం అందుకు బిన్నంగా వ్యవరిస్తుండటంతో ఇది రాజకీయ ప్రేరేపిత నిర్ణయం తప్ప మరొకటి కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it